నేడే వైఎస్సార్‌సీపీ సమైక్య ధర్నా
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఏర్పాట్లు పూర్తి
ఉదయం 10 గంటలకు ధర్నా ప్రారంభం
మద్దతు ప్రకటించిన వివిధ సంఘాలు
భారీ సంఖ్యలో ఢిల్లీకి చేరుకున్న సమైక్యవాదులు
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగుజాతిని విచ్ఛిన్నం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం పన్నుతున్న కుయుక్తులను ఎండగట్టేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీలో సోమవారం సమైక్యనాదం వినిపించనున్నారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును ఆమోదించుకొనేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలకు నిరసనగా ఇక్కడి జంతర్‌మంతర్ వద్ద భారీ ఎత్తున సమైక్య ధర్నా నిర్వహించనున్నారు. లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టిన తీరును నిరసిస్తూ... పూర్తి ఏకపక్షంగా, అడ్డగోలుగా జరుగుతున్న విభజనను వ్యతిరేకించాలని ధర్నా వేదికగా మరోమారు జాతీయ పార్టీలకు జగన్‌మోహన్‌రెడ్డి విజ్ఞప్తి చేయనున్నారు. ఈ ధర్నాకు సంబంధించి జంతర్‌మంతర్ వద్ద ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. వేల సంఖ్యలో సమైక్యవాదులు ఈ ధర్నాకు హాజరుకానున్నట్లు సమాచారం. ఆదివారం సాయంత్రానికే రాష్ట్రం నుంచి పెద్ద సంఖ్యలో పార్టీ నేతలు, సమైక్యవాదులు ఢిల్లీకి చేరుకున్నారు. పెద్ద సంఖ్యలో సమైక్యవాదులు తరలివస్తున్న ప్రత్యేక రైళ్లు సోమవారం ఉదయానికి ఢిల్లీకి చేరుకోనున్నాయి. వైఎస్సార్‌సీపీ చేపట్టిన ఈ ధర్నాకు వివిధ సంఘాలు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించాయి.
ఉదయం 10కి ప్రారంభం..
వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ సమైక్య ధర్నా సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో పాటు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లాల అధ్యక్షులు, వివిధ అనుబంధ శాఖల అధ్యక్షులు, నియోజకవర్గ కోఆర్డినేటర్లు, భారీ సంఖ్యలో సమైక్యవాదులు ఈ ధర్నాలో పాల్గొంటున్నారు. దాదాపు 100 మంది ధర్నా వేదికపై ఉండేలా చర్యలు తీసుకున్నారు. ధర్నాకు హాజరయ్యే వారికోసం వేదిక ముందు భారీ టెంట్లు ఏర్పాటు చేశారు. కాగా, జంతర్‌మంతర్ వద్ద ధర్నా ఏర్పాట్లను పార్టీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు కొరుముట్ల శ్రీనివాసులు, గుర్నాథరెడ్డి, పార్టీ ఐటీ విభాగం అధ్యక్షుడు చల్లా మధుసూదన్‌రెడ్డి ఆదివారం ఉదయం పర్యవేక్షించారు. ధర్నాకు వచ్చే సమైక్యవాదులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలను సూచించారు.
విద్యార్థి, ఉద్యోగ సంఘాల మద్దతు..
వైఎస్సార్‌సీపీ సమైక్య ధర్నాకు పలు విద్యార్థి, ఉద్యోగ సంఘాలు మద్దతు ప్రకటించాయి. సమైక్యం కోసం మొదటి నుంచీ పోరాడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ నిర్వహించనున్న ధర్నాకు పూర్తి మద్దతు ఇస్తున్నామని సెక్రటేరియట్ ఉద్యోగుల సంఘం నేత వెంకట్రామిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. సీమాంధ్ర విద్యార్థి సంఘాల జేఏసీ కన్వీనర్ అడారి కిశోర్, సీమాంధ్ర మేధావుల ఫోరం నేత చలసాని శ్రీనివాస్ తదితరులు వైఎస్ జగన్‌ను ఆయన నివాసంలో కలిసి ధర్నాకు పూర్తి మద్దతు ప్రకటించారు.
కేంద్ర ఆటవిక చర్యను ప్రపంచం దృష్టికి తీసుకెళ్తాం:ఎమ్మెల్యేలు కొరుముట్ల, గుర్నాథరెడ్డి
అప్రజాస్వామికంగా జరుగుతున్న విభజనను జాతి మొత్తానికి తెలిపేందుకే భారీ ధర్నా నిర్వహిస్తున్నామని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు కొరుముట్ల శ్రీనివాసులు, గుర్నాథరెడ్డి తెలిపారు. కేంద్రం సాగిస్తున్న ఈ ఆటవిక చర్యను మొత్తం ప్రపంచం దృష్టికి తీసుకెళ్తామన్నారు. సమైక్యం కోసం నిరంతరం కృషి చేస్తున్న జగన్ ధర్నాకు సమైక్యవాదులు పెద్దసంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు. భవిష్యత్ తరాల బాగుకోసం జరుగుతున్న ఈ ధర్నాతో అయినా కేంద్రం కళ్లు తెరవాలన్నారు.