
జర్నలిజం వదిలేయమని చెప్పా...
భోపాల్: ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో మైనింగ్, ల్యాండ్ మాఫియా ఆగడాలకు బలైన జర్నలిస్టుల ఉదంతాలు మీడియా స్వేచ్ఛను మరోసారి చర్చనీయాంశంగా మార్చాయి. దేశంలో జర్నలిస్టులపై పెరుగుతున్న దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. తమ అవినీతి చరిత్రను బట్టబయలు చేస్తున్న విలేకరులపై విచక్షణ రహితంగా దాడులు చేసి హతమారుస్తున్నారు. ఓపక్క ఉత్తరప్రదేశ్లో జోగిందర్ సింగ్ అనే జర్నలిస్టును హతమార్చిన ఘటనపై పోలీసులు విచారణ జరుపుతుండగానే.. మధ్యప్రదేశ్ కు చెందిన విలేకరి సందీప్ కొఠారి (44) హత్య కలకలం రేపింది.
ఈనెల 19 నుంచి కనిపించకుండా పోయిన సందీప్ మహారాష్ట్రలోని నాగ్పూర్ జిల్లాలోని ఓ అటవీ ప్రాంతంలో శవమై తేలడంతో మరో జర్నలిస్టు కుటుంబం విషాదంలో మునిగిపోయింది. ఏం నేరం చేశాడని తన సోదరుడిని హతమార్చారని సందీప్ కొఠారియా సోదరి సంధ్య ప్రశ్నిస్తున్నారు. ''జర్నలిజం వదిలేయ్... లేకపోతే చంపేస్తారని అన్నకు చాలా సార్లు చెప్పాను. అయినా అన్నయ్య లక్ష్యపెట్టలేదు. చివరకు ల్యాండ్ మాఫియా అక్రమాలకు అన్నయ్య బలైపోయాడు'' అంటూ సందీప్ కొఠారి సోదరి సంధ్య వాపోయారు. తన సోదరుడు నేరస్తుడు కాదని, ఎవ్వరూ చేయనంత సాహసం చేసి ఎన్నో అక్రమాలకు వెలుగులోకి తీసుకొచ్చాడని తెలిపారు. అతనిపై ఎన్నో అక్రమ కేసులు బనాయించి, వేధించి చివరికి ప్రాణాలు తీశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 25 కేసులు నమోదు చేశారని 17 నెలలు జైల్లో పెట్టారని ఆరోపించారు. ల్యాండ్ మాఫియాకు వ్యతిరేకంగా పని చేసినందుకు తమ కుటుంబానికి మంచి మూల్యం లభించిందని సందీప్ సోదరుడు రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు.