దీదీని హతమార్చేందుకు కుట్ర!
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రయాణిస్తున్న ఓ ప్రైవేటు విమానం కోల్‌కతా విమానాశ్రయం వద్ద దాదాపు అరగంట పాటు ల్యాండింగ్ కాకుండా గాలిలో చక్కర్లు కొడుతూనే ఉంది. దాంతో.. తమ దీదీని చంపేందుకు కుట్ర జరుగుతోందని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. పెద్దనోట్ల రద్దుకు నిరసనగా బిహార్‌లో నిర్వహించిన ర్యాలీ అనంతరం రాత్రి 7.35 గంటల సమయంలో మమత అక్కడ విమానం ఎక్కారు. వాస్తవానికి అది 6.35కే రావాల్సి ఉంది. తర్వాత సాంకేతిక కారణాల వల్ల విమానం అరగంట పాటు గాల్లోనే తిరుగుతూ 9 గంటల సమయంలో ల్యాండయిందని విమానాశ్రయం అధికారులు తెలిపారు. ఏ విమానాశ్రయంలో అయినా ఇలాంటి ఘటనలు మామూలేనని అన్నారు.
ఏటీసీ నుంచి అనుమతి రాకపోవడం వల్లనే విమానం కిందకు దిగలేదని, ఇదంతా మమతను హతమార్చేందుకు జరగుతున్న కుట్రేనని తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఫిర్హాద్ హమీక్ ఆరోపించారు. ఆయన కూడా మమతతో పాటే విమానంలో వచ్చారు. తాము ఐదు నిమిషాల్లో కోల్‌కతా వస్తామని పైలట్ 180 కిలోమీటర్ల ముందునుంచే చెబుతున్నా.. అరగంట ఆలస్యంగా విమానం కిందకు దిగాల్సి వచ్చిందని ఆయన అన్నారు. దీంతో మమతా బెనర్జీతోపాటు ఇతర ప్రయాణికులకు కూడా తీవ్ర అసౌకర్యం కలిగిందన్నారు. విమానంలో ఇంధనం అయిపోతోందని పైలట్ చెప్పినా.. ఏటీసీ మాత్రం విమానాన్ని గాల్లోనే ఉంచేసిందని ఆయన ఆరోపించారు. ఇది ముఖ్యమంత్రిని చంపడానికి చేసిన కుట్ర తప్ప మరొకటి కానే కాదని.. పెద్దనోట్ల రద్దును గట్టిగా ప్రశ్నించడమే కాక, ప్రజా ఉద్యమంలో భాగంగా ఆమె దేశవ్యాప్తంగా తిరుగుతున్నందునే ఆమెను చంపాలనుకుంటున్నారని హకీమ్ అన్నారు.