అగర్తలా: టీచర్స్ నియమాకానికి టెట్ అనే అంశాన్ని పక్కకు పెట్టింది త్రిపుర ప్రభుత్వం. ప్రాథమిక పాఠశాలల్లో టీచర్స్ ఎంపికను ఎటువంటి టెస్టు లేకుండానే నియమించడానికి సిద్ధమైంది. ఈ మేరకు గురువారం రాత్రి భేటీ అయిన రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇలా ఏ విధమైన టెస్టులు లేకుండా టీచర్స్ నియామకం జరగడం 17 ఏళ్లలో ఇదే తొలిసారి. జూనియర్, సీనియర్ విభాగాల్లో 4,606 పోస్టులు అత్యవసరమైన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
దీనికి సంబంధించి త్రిపుర విద్యాశాఖ మంత్రి తపాన్ చక్రబోర్టి మీడియాతో మాట్లాడారు. టీచర్ పోస్టులు అనివార్యమైన తరుణంలోనే టెట్ లేకుండా నియామకం చేపడుతున్నట్లు తెలిపారు. ఇలాగైతే ఆర్టీఐ చట్టాన్ని ప్రభుత్వం ఉల్లంఘించినట్లే కదా? విలేకరి అడగ్గా.. అన్ని అంశాలను కూలంకుశంగా పరిశీలించిన తరువాతే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు. టీచర్ పోస్టుల నియమాకానికి 2002 లో పక్కకు పెట్టిన కొన్ని దరఖాస్తులను కూడా పరిశీలించామన్నారు. కాగా, 2009 ఆర్టీఈ చట్టం ప్రకారం.. విద్య అనేది ప్రతి ఒక్కరికి ఉచితంగాను, తప్పనిసరిగా అందించడమే కాకుండా, టీచర్ల నియమాకానికి టెట్ తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే.