సాక్షి, న్యూఢిల్లీ : జీఎస్టీ పరిహారం బకాయిలపై వివిధ పార్టీల ఎంపీలు లోక్‌సభలో ఆందోళన వ్యక్తంచేశారు.టీఆర్‌ఎస్ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ వంగ గీతావిశ్వనాథ్, మార్గాని భరత్, బీజేడీ ఎంపీ చంద్రశేఖర్ సాహులు సోమవారం ఉదయం లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో ఈ అంశంపై ప్రశ్నలు సంధించారు. టీఆర్‌ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ప్రశ్న సంధిస్తూ ‘ఆర్థిక మందగమనం నేపథ్యంలో పరిహారం ఇవ్వాల్సిన ఆవశ్యకత మరింత పెరిగింది. తెలంగాణలో చేపడుతున్న అభివృద్ధి ప్రా జెక్టులు ముందుకు సాగాలంటే కేంద్రం నుంచి మ రింత సహకారం అవసరం. తెలంగాణకు జీఎస్టీ పరిహారం ఎప్పుడు ఇస్తారో చెప్పాలని కోరుతున్నా. నవంబరు 2019 నుంచి జనవరి 2020 వరకు ఇవ్వాల్సిన పరిహారం బకాయిలో ఉంది.
జీఎస్టీ వ్య వస్థను స్థిరీకరించేందుకు, జీఎస్టీలో ఉన్న గందరగోళాన్ని తొలగించేందుకు కేంద్రం ఎలాంటి చర్యలు చేపడుతుందో వివరించాలి..’అని ప్రశ్నించారు. దీని కి ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్‌సింగ్ ఠాకూ ర్ సమాధానం ఇస్తూ ‘గడిచిన మూడు నెలల జీఎస్టీ పన్ను వసూళ్లు రూ.లక్ష కోట్ల కంటే ఎక్కువే ఉంది. ఇక కార్పొరేషన్ టాక్స్, ఆదాయపన్ను ఏప్రిల్ నుంచి జూన్ వరకు మూడు విడతలుగా 15 శాతం, జూలై నుంచి జనవరి వరకు ఏడు వాయిదాల్లో 50 శాతం, ఫిబ్రవరి నుంచి మార్చి వరకు నాలుగు వాయిదాల్లో 35 శాతం మేర చెల్లిస్తాం.
పరోక్ష పన్నులను 14 వాయిదాల్లో ఇస్తాం. 20వ తేదీలోపు టాక్స్ రిటర్న్ ఫైల్ అయ్యీ పన్ను వసూలైతే అదే రోజు పరిహారం కూడా చెల్లిస్తాం..’అని వివరించారు. ఇదే అంశంపై టీఆర్‌ఎస్ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు కేంద్రం వైఖరిపై అసంతృప్తి వ్యక్తంచేశారు. ‘జీఎస్టీ బకాయిల విషయంలో మంత్రి సమాధానం సరిగా లేదు. ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ప్రతి రాష్ట్రానికి జీఎస్టీ, ఐజీఎస్టీ పెండింగ్‌లో ఉంది. మా ముఖ్యమంత్రి దీనిపై కేంద్రానికి లేఖ కూడా రాశారు.
రాష్ట్రానికి రూ. 5 వేల కోట్ల మేర జీఎస్టీ, ఐజీఎస్టీ ఇవ్వాల్సి ఉంది. సమయానుసారం ఇవ్వనిపక్షంలో రాష్ట్ర ప్రగతిపై ప్రభావం పడుతుంది. దాదాపు 10 పార్టీలు దీనిపై గతంలో ప్రశ్నిస్తే జీఎస్టీ, ఐజీఎస్టీ ఎప్పటికప్పుడు విడుదల చేస్తామని చెప్పారు. ఇప్పుడు కూడా రాష్ట్రాలకు ఉన్న బకాయిలపై స్పష్టత ఇవ్వడం లేదు. తెలంగాణకు ఇవ్వాల్సిన రూ.5 వేల కోట్ల బకాయిలను తక్షణం విడుదల చేయాలి..’అని పేర్కొన్నారు. దీనికి అనురాగ్ సింగ్ ఠాకూర్ సమాధానం ఇస్తూ ‘నామా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. కానీ ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో ఒక విషయం స్పష్టంచేశారు. జీఎస్టీ పరిహార నిధి నుంచి ఇవ్వాల్సిన బకాయిలను 2016–17, 2017–18 ఆర్థిక సంవత్సరాల్లో వసూలు చేసిన నిధుల నుంచి రెండు విడతలుగా ఇస్తాం. ఇకపై జీఎస్టీ పరిహారం సెస్ రూపంలో వసూలయ్యే మొత్తం నుంచి మాత్రమే పరిహారంగా ఇస్తాం..’అని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment