ఢిల్లీకి దినకరన్.. చెన్నైలో ముగిసిన విచారణ
చెన్నై: రెండాకుల గుర్తు తమ వర్గానికి దక్కడం కోసం ఎన్నికల కమిషన్ అధికారులకే కోట్లలో లంచం ఇవ్వడానికి ప్రయత్నించిన అన్నాడీఎంకే (అమ్మ) బహిష్కృత నేత టీటీవీ దినకరన్‌ను క్రైం బ్రాంచ్ పోలీసులు చెన్నై నుంచి ఢిల్లీకి తరలించారు. తమ కస్టడీలో ఉన్న దినకరన్‌ను గురువారం చెన్నైకి తీసుకొచ్చిన పోలీసులు అడయార్‌లోని నివాసంలో గత రెండు రోజులుగా విచారణ చేశారు. ఇదే కేసులో అరెస్టయిన ఆయన స్నేహితుడు మల్లికార్జున్ అన్నానగర్ శాంతి కాలనీలోని ఇంట్లో ఉంచి విచారణ చేశారు. వీరి వద్ద నుంచి కొన్ని కీలక సాక్ష్యాలు సేకరించారు.
చెన్నైలో దినకరన్‌ను విచారించిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆయనను రాజాజీ భవన్‌నుంచి చెన్నై ఎయిర్‌పోర్టుకు తీసుకొచ్చారు. అక్కడి నుంచి విమానంలో ఢిల్లీకి చేరుకున్నారు. అక్కడే పూర్తిస్థాయి విచారణ చేపట్టనున్నారు. పోరూర్‌లోని మరో ఇంట్లో, తిరువేర్కాడులోని ఓ నివాసంలో గంటపైగా విచారణ సాగించిన ఢిల్లీ బృందం తదుపరి రాజాజీభవన్‌కు చేరుకుని దినకరన్‌ను, మల్లికార్జున్‌ను పలు విషయాలపై ప్రశ్నించారు. ఈసీకి లంచం ఇవ్వజూపిన కేసులో ఢిల్లీలోనూ పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకున్నారు.
అన్నాడీఎంకే పార్టీ గుర్తు తమ వర్గానికి దక్కడం కోసం ఏకంగా ఎన్నికల కమిషన్ అధికారులకు రూ.50 కోట్లు లంచం ఇవ్వజూపిన కేసులో టీటీవీ దినకరన్ వెనక ఉన్నది మన్నార్‌గుడి మాఫియా అని దాదాపు తేలిపోయింది. ఐదు రోజుల కస్డడీలో ఉన్న దినకరన్‌ను ఢిల్లీకి తీసుకెళ్లి కేసుకు సంబంధించిన నివేదికను తయారు చేయనున్నారు. విదేశాలకు పారిపోయే అవకాశం ఉందని భావించిన ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ముందస్తుగా ఆయనకు లుక్ అవుట్ నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే.