
సాక్షి, చెన్నై: తమిళనాట రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఒకవైపు సినీ నటులు రజనీకాంత్, కమల్ హాసన్ రాజకీయాల్లోకి వచ్చేందుకు వేగంగా సన్నాహాలు చేస్తుండగా.. మరోవైపు శశికళ వర్గం కూడా సొంత కుంపటి పెట్టేదిశగా అడుగులు వేస్తోంది. ఇటీవల ప్రతిష్టాత్మకంగా జరిగిన ఆర్కే నగర్ ఉప ఎన్నికలో ఘనవిజయం సాధించిన టీటీవీ దినకరన్ సొంత పార్టీ పెట్టేదిశగా వేగంగా కదులుతున్నారు. మద్దతుదారులతో చర్చించి త్వరలోనే కొత్త పార్టీని ప్రకటిస్తానని తాజాగా బుధవారం దినకరన్ వెల్లడించారు. అన్నాడీఎంకేను, రెండాకుల గుర్తును కాపాడుకోవడానికే కొత్త పార్టీని పెట్టాలని భావిస్తున్నట్టు దినకరన్ తెలిపారు. రెండాకుల గుర్తును సొంతం చేసుకుంటామని అన్నారు.
అన్నాడీఎంకేకు చెందిన 90శాతం కేడర్ తనవైపే ఉందని దినకరన్ ధీమా వ్యక్తం చేశారు. ఓపీఎస్, ఈపీఎస్‌లకు తప్ప అందరికీ తన పార్టీలో స్థానం ఉంటుందన్నారు. ఓపీఎస్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే.. అన్నాడీఎంకేలోని స్లీపర్ సెల్స్ బయటకు వస్తారని తన మద్దతుదారులైన ఎమ్మెల్యేలను ఉద్దేశించి అన్నారు. ఓపీఎస్ ప్రభుత్వం కూలిపోతుందని, ప్రభుత్వం పడిపోయాక ఓపీఎస్, ఈపీఎస్ బండారం బట్టబయలు చేస్తానని హెచ్చరించారు. సీఎం ఓపీఎస్ ఎంతటి అవినీతి తిమింగలమో త్వరలోనే బయటపెడతానని పేర్కొన్నారు. సినిమా వారు ఎవరైనా రాజకీయాల్లోకి రావచ్చు అని రజనీ, కమల్ ఎంట్రీ గురించి కామెంట్ చేశారు. కానీ సినిమాలే కాక రాజకీయాల్లో అనేక విషయాలు ఉంటాయని, ఆ విషయాలు తమకు తెలుసునని అన్నారు. అందుకే రాబోయే రోజుల్లో తాను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని ధీమా వ్యక్తం చేశారు.