టీవీవీ ట్విస్ట్‌: మరో ఇద్దరు ఎమ్మెల్యేలు జంప్‌ | two more MLAs joins with Dinakaran | Sakshi
Sakshi News home page

టీవీవీ ట్విస్ట్‌: మరో ఇద్దరు ఎమ్మెల్యేలు జంప్‌

Published Sat, Aug 26 2017 7:21 PM | Last Updated on Tue, Sep 12 2017 1:02 AM

two more MLAs joins with Dinakaran

- దినకరన్‌ శిబిరంలోకి రత్నసభాపతి, కలైసెల్వన్‌
- త్వరలో మరింత మంది వస్తారన్న శశి సోదరుడు
- చైన్నైకి గవర్నర్‌.. నిర్ణయంపై ఉత్కంఠ



చెన్నై:
తమిళనాడులో అధికార పార్టీ రాజకీయాలు ఊహించని విధంగా మారిపోతున్నాయి. పళనిస్వామి ప్రభుత్వాన్ని కూల్చేసేందుకు కంకణం కట్టుకున్న టీవీవీ దినకరన్‌ మళ్లీ ట్విస్ట్‌ ఇచ్చారు. తాజాగా మరో ఇద్దరు ఎమ్మెల్యేలను తనవైపునకు లాగేసుకున్నారు. ఎమ్మెల్యేలు రత్నసభాపతి, కలైసెల్వన్‌లు శనివారం టీవీవీ శిబిరంలో చేరిపోవడంతో వైరివర్గం బలం 21కి పెరిగింది. ఇప్పటికి వచ్చినవాళ్లే కాకుండా.. రెండు రోజుల్లో 8 మంది మంత్రులు, 60 మంది ఎమ్మెల్యేలు తమవైపునకు రానున్నట్లు శశికళ తమ్ముడు దివాకరన్‌ శనివారం మీడియాకు చెప్పారు.

అనర్హతనూ లెక్కచేయని ఎమ్మెల్యేలు: శుక్రవారం వరకు దినకరన్‌తో ఉన్న 19 మంది ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి అసెంబ్లీ స్పీకర్‌ ధన్‌పాల్‌ నోటీసులు జారీచేశారు. అయితే స్పీకర్‌ ఇచ్చిన నోటీసులు తమకు అందలేదని, ఒకవేళ అందినా బదులిచ్చేది లేదని దినకరన్‌ వర్గం ఎమ్మెల్యే వెట్రివేల్‌ తేల్చిచెప్పారు. రెండు రోజుల్లోగా గవర్నర్‌ ఏదైనా నిర్ణయం తీసుకోని పక్షంలో రాష్ట్రపతిని కలుస్తామని అదే వర్గానికి చెందిన మరో ఎమ్మెల్యే తంగతమిళ్‌ సెల్వన్‌ చెప్పారు.

అసెంబ్లీలో అన్నాడీఎంకేకు 134 మంది ఎమ్మెల్యేలు ఉండగా వీరిలో 21 మంది దినకరన్‌ వైపు ఉన్నారు. దీంతో ఎడపాడి బలం 122 నుండి 113కి పడిపోయింది. ప్రభుత్వం నిలబడేందుకు మరో నలుగురు ఎమ్మెల్యేలు అవసరం. అన్నాడీఎంకే మద్దతుతో గెలిచిన మిత్రపక్ష పార్టీ ఎమ్మెల్యేలు ముగ్గురు తాత్కాలికంగా తటస్థవైఖరి అవలంబిస్తున్నా వారు దినకరన్‌వైÐఽపే మొగ్గుచూపుతున్నారు.

చెన్నైకి గవర్నర్‌.. నిర్ణయంపై ఉత్కంఠ
ప్రభుత్వం మైనార్టీలో పడిపోయిన స్థితిలో ఎలాంటి నిర్ణయం ప్రకటించకుండా ముంబయికి వెళ్లిన తమిళనాడు తాత్కాలిక గవర్నర్‌ విద్యాసాగర్‌రావు శనివారం సాయంత్రం తిరిగి చెన్నైకి చేరుకున్నారు. ఈ  సందర్భంగా ఎడపాడి ప్రభుత్వంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోననే ఉత్కంఠ అందరిలో నెలకొంది. అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోవాలని గవర్నర్‌ ఆదేశించిన పక్షంలో ఎడపాడి ఇరుకునపడక తప్పదు. ఇదిలా ఉండగా, ఉప రాష్ట్రపతి హోదాలో ఎం వెంకయ్యనాయుడు ఆదివారం తొలిసారిగా చెన్నైకి వస్తున్నారు. ఆయనకు స్వాగతం పలికేందుకే గవర్నర్‌ వస్తున్నారని, ఇతరత్రా మరే నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండబోదని కొందరు అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement