విద్యార్థులు, తల్లిదండ్రులపై ఓ ట్యూటర్ దుశ్చర్య
వడోదర: ఎలాగైనా మంచి మార్కులు సాధించడమేకాకుండా, గొప్ప ఉద్యోగాలు సంపాధించాలని విద్యార్థుల ఆత్రుత.. దానిని మరింత పరుగులుపెట్టించేంతగా తల్లిదండ్రుల ఒత్తిడి వెరసి ఓ ప్రైవేటు టీచర్కు బుద్ధితక్కువ ఆలోచనకు దారి తీసింది. నేలపై గాజుపెంకలు పరిచి వాటిపై నడిచి మీలో ఆత్మ విశ్వాసాన్ని పెంచుకోండి అంటూ ఆ పనిచేయించాడు గుజరాత్ లో ఓ ప్రైవేటు ట్యూషన్ టీచర్.. ఆ పని కేవలం ఆ యువ విద్యార్థులతోనే కాకుండా వారి తల్లిదండ్రులతో కూడా చేయించాడు.
ఈ విషయం బయటకు తెలిసి పోలీసులు విచారణ ప్రారంభించారు. వడోదరాలో రాకేశ్ పటేల్ అనే ఓ ప్రైవేటు టీచర్ కోచింగ్ సెంటర్ నడుపుతున్నాడు. అతడి వద్దకు శిక్షణకు వస్తున్న యువకుల్లో ఓ 70మందిని ఎంచుకొని వారి తల్లిదండ్రులను కూడా పిలిపించాడు. అనంతరం తన కోచింగ్ సెంటర్ లోనే నేలపై గాజు పెంకలు పరిచి వాటిపై నడవమన్నాడు. తాను కూడా గతంలో అలాగే చేశానని, అందువల్ల తనలో గొప్పగా ఆత్మవిశ్వాసం పెంపొందిందని చెప్పాడు. చాలామంది ఈ గాజుపెంకులపై నడిచారని, వారికి ఏమీ కాలేదని అన్నారు. కాగా, ఈ అంశాన్ని వడోదర కలెక్టర్ తోపాటు గుజరాత్ విద్యాశాఖ మంత్రి భూపేంద్రసిన్హ చుదాశ్మ కూడా సీరియస్ గా తీసుకున్నారు. ఇలాంటి చర్యలకు దిగుతున్నవారిని కఠినంగా శిక్షిస్తామని చెప్పారు.