
'మొరటు' వ్యవహారంలో మరో ట్విస్ట్
న్యూఢిల్లీ/లక్నో: బీఎస్పీ అధినేత్రి మాయావతిపై అనుచిత వ్యాఖ్యల వ్యవహారం మరో మలుపు తిరిగింది. బీఎస్పీ కార్యకర్తలు తమను వేధిస్తున్నారంటూ మాయావతిపై ఉత్తరప్రదేశ్ బీజేపీ మాజీ ఉపాధ్యక్షుడు దయాశంకర్ సింగ్ భార్య స్వాతి సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ఆమె సిద్ధమవుతున్నారు. బీఎస్పీ నాయకులు, కార్యకర్తల అనుచిత వ్యాఖ్యలతో మానసికంగా నలిగిపోతున్నామని, ముఖ్యంగా తమ 12 ఏళ్ల కుమార్తె తీవ్ర మనోవేదనకు గురైందని స్వాతి సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే దయాశంకర్ కుటుంబ సభ్యులను తమ పార్టీ మద్దతురాలు వేధించలేదని మాయావతి అన్నారు. తనపై దయాశంకర్ చేసిన వ్యాఖ్యలతో బీఎస్పీ కార్యకర్తలు ఆవేదనకు లోనయ్యారని చెప్పారు. బలహీనవర్గాల ప్రజలను తనను సోదరి, దేవతగా ఆరాధిస్తారని అన్నారు. దయాశంకర్ కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేయొద్దని తమ పార్టీ కార్యకర్తలకు సూచించినట్టు చెప్పారు. తమను అవమానించారని చెబుతున్న దయాశంకర్ కుటుంబ సభ్యులు.. మహిళలకు జరిగిన పరాభవాన్ని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారని ప్రశ్నించారు.