మాయావతిపై ఎఫ్ఐఆర్ నమోదు
లక్నో: బీఎస్పీ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మాయావతిపై మొరటు వ్యాఖ్యలు వ్యవహారంలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్ బీజేపీ మాజీ ఉపాధ్యక్షుడు దయాశంకర్ సింగ్ భార్య స్వాతి సింగ్ శుక్రవారం మాయవతిపై హజ్రత్ గంజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో మాయావతితో పాటు మరో ముగ్గురు బీఎస్పీ నేతలపై ఎఫ్ఐఆర్ నమోదు అయింది.
పార్టీ అధినేత్రితో పాటు సీనియర్ నేత నసీముద్దీన్ సిద్దఖీపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా తమ కుటుంబసభ్యుల పట్ల బీఎస్పీ కార్యకర్తలు అనుచితంగా ప్రవర్తించారని స్వాతిసింగ్ ఆరోపించారు. తన కుమార్తెను ఆ పార్టీ కార్యకర్తలు బెదిరిస్తున్నారని ఆమె వాపోయారు. తన భర్త మాత్రమే రాజకీయాల్లో ఉన్నారని, తమ కుటుంబం కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఈ వ్యవహారంలో తమను అనవసరంగా లాగుతున్నారని స్వాతి సింగ్ వాపోయారు. కాగా దయాశంకర్ సింగ్ ఇప్పటికీ అజ్ఞాతంలోనే ఉన్నారు. ఆయన కోర్టులో లొంగిపోయే అవకాశం ఉంది.