
చండీఘర్: ప్రముఖ పంజాబీ పాప్ సింగర్ హార్ద్ కౌర్ తన దూకుడుతో మరోసారి వార్తల్లోకెక్కింది. గతంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయగా.. ఆమెపై దేశద్రోహంతో పాటు పలు కేసులు కూడా నమోదైన సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఆమె తన పద్ధతి మార్చుకోనట్లుగా అనిపిస్తోంది. ఈసారి ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాలపై పాట రూపంలో హార్ద్ కౌర్ విరుచుకుపడింది. పంజాబ్ నుంచి విడిపోయి ప్రత్యేక దేశం ఖలిస్తాన్ కావాలని కోరుకుంటున్న సిక్కులకు మద్దతుగా ఈ పాట సాగుతుంది. రెండున్నర నిమిషాల నిడివి ఉన్న ఈ పాటలో ఖలిస్తాన్ మద్దతుదారులతో కలిసి మోదీ, అమిత్ షాలకు ఘాటుగా సవాలు విసురుతుంది. అంతటితో ఆగక వారిద్దరిపై అభ్యంతరకర పదజాలాన్ని ప్రయోగించింది. ఈ వీడియోను కౌర్ ట్విటర్‌లో పోస్ట్ చేయగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై స్పందించిన ట్విటర్ హార్ద్ కౌర్ అకౌంట్‌ను తొలగిస్తున్నట్లుగా ప్రకటించింది.
యూకేకు చెందిన గాయని తరన్ కౌర్ ధిల్లాన్ (హర్ద్ కౌర్) గతంలోనూ సంచలన వ్యాఖ్యలు చేయగా అవి పెద్ద దుమారాన్నే రాజేశాయి. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌పై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై వారణాసిలో పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. బాలీవుడ్ గాయని హర్ద్ కౌర్‌పై సెక్షన్ 124 ఏ, 153 ఏ, 500 కింద ఎఫ్‌ఐఆర్ నమోదైంది. సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను ఏకంగా రేప్‌మేన్ అని పిలవాలంటూ సోషల్ మీడియాలో కమెంట్ చేశారు. అంతేకాదు.. మోహన్ భగవత్ ఉగ్రవాదిగా పేర్కొన్నారు. ఈ మేరకు ఫేస్‌బుక్‌లో తన అభిప్రాయాలను పోస్ట్ చేశారు. దీంతో వివాదం రాజుకుంది. పలువురు నెటిజర్లు ఆమెకు మద్దతివ్వగా, మరికొందరు ఆమె వ్యాఖ్యలపై మండిపడ్డారు. ప్రధానంగా వారణాసికి చెందిన ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త, న్యాయవాది శశాంక్ శేఖర్ ఫిర్యాదు చేయడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది. దీనిపై దర్యాప్తు చేపట్టామని పోలీసు అధికారి అమర్ ఉజాలా తెలిపారు.

Comments
Please login to add a commentAdd a comment