లష్కరే కమాండర్ మట్టూ హతం
లష్కరే కమాండర్ మట్టూ హతం
Published Sat, Jun 17 2017 2:35 AM | Last Updated on Tue, Sep 5 2017 1:47 PM
- అతని అనుచరుడు ముజామిల్ కూడా..
- సజీవంగా చిక్కిన మరో ఉగ్రవాది
శ్రీనగర్: కశ్మీర్‌లో మరో అగ్ర మిలిటెంట్‌ను భద్రతా బలగాలు మట్టుపెట్టాయి. అనంత్‌నాగ్ జిల్లాలో శుక్రవారం జరిగిన ఎదురుకాల్పుల్లో లష్కరే తోయిబా కమాండర్ జునైద్ మట్టూతో పాటు అతని సహచరుడు ముజామిల్ హతమయ్యాడు. బిజిబిహారా సమీపంలోని ఆర్వాని గ్రామంలోని ఓ ఇంట్లో ముగ్గురు ఉగ్రవాదులు దాగి ఉన్నారన్న సమాచారంతో పోలీసులు, ఆర్మీ, సీఆర్‌పీఎఫ్ చేపట్టిన ఈ ఆపరేషన్లో మరో ఉగ్రవాదిని సజీవంగా పట్టుకున్నారు. సంఘటనా స్థలం వద్ద తమపై రాళ్లు రువ్విన ప్రజలపై భద్రతా దళాలు కాల్పులు జరపడంతో ఇద్దరు చనిపోయారు. ఉగ్రవాదులు దాగి ఉన్న ఇంటిని భద్రతా దళాలు ఉదయం 8 గంటలకే చుట్టుముట్టాయి. 10 గంటలకు వారి నుంచి కాల్పులు మొదలవడంతో ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో 8 గంటల పాటు ముగ్గురు ఉగ్రవాదులు ఇంటిలోనే చిక్కుకుపోయారు. ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని స్థానికులు రాళ్లు రువ్వడం తమకు ప్రతిబంధకంగా మారిందని పోలీసులు తెలిపారు.
రూ. 10 లక్షల రివార్డు
రెండేళ్లుగా ఉగ్ర కార్యకలాపాల్లో చురుగ్గా ఉన్న మట్టూ తలపై పోలీసులు రూ. 10 లక్షలు ప్రకటించారు. 18 ఏళ్ల వయసులో మిలిటెన్సీలో చేరిన మట్టూ, కశ్మీర్‌లో మోస్ట్ వాంటెడ్ 12 మంది ఉగ్రవాదుల జాబితాలో ఒకడు. గతేడాది పోలీసు వాహనంపై దాడిచేసి ముగ్గురిని హతమార్చిన దాడిలో అతడి పాత్ర ఉంది. గురువారం కుల్గాం జిల్లాలో ఓ పోలీసు అధికారి హత్యలో మట్టూ ప్రమేయం ఉందని అనుమానిస్తున్నారు. గతేడాది బుర్హాన్ వనీ తరువాత లోయలో చనిపోయిన మూడో టాప్ మిలిటెంట్ మట్టూనే.
ఇద్దరు పౌరుల మృతి
ఉగ్రవాదులను మట్టుపెట్టే ఆపరేషన్‌లో భద్రతా దళాలు నిమగ్నమై ఉన్నపుడు స్థానికులు వారితో ఘర్షణకు దిగడం ఉద్రిక్తతలకు దారి తీసింది. ఈ క్రమంలో అల్లరిమూకలను చెదరగొట్టడానికి పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు చనిపోగా, 10 మంది గాయపడ్డారు.
పాక్ కాల్పుల్లో జవాన్ మృతి
రాజౌరీ జిల్లాలో నియంత్రణ రేఖ(ఎల్‌వోసీ) వెంట శుక్రవారం పాక్ సైన్యం కాల్పులు జరపడంతో భారత సైనికుడు మృతిచెందాడు. భారత సైన్యం దీటుగా తిప్పికొట్టింది. పాక్ కాల్పుల్లో గాయపడిన జవాన్ నాయక్(34) భక్తావర్ సింగ్‌ను ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయాడు. నాయక్ సొంతూరు పంజాబ్ హోషిరాపూర్ జిల్లాలోని హజీపూర్.
ఉగ్ర దాడిలో ఆరుగురు పోలీసుల మృతి
శ్రీనగర్: కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో శుక్రవారం పోలీసుల వాహనంపై ఉగ్రవాదులు మెరుపు దాడికి పాల్పడటంతో ఆరుగురు పోలీసులు చనిపోయారు. పోలీసులు అనంతనాగ్‌లో విధులు ముగించుకుని అచాబల్ తిరిగి వెళ్తుండగా కుల్గాడ్ గ్రామంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. తర్వాత మృతుల ముఖాలను ఛిద్రం చేసి, పోలీసుల ఆయుధాలను తీసుకుని పారిపోయారు. ఈ దాడికి పాక్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే బాధ్యత ప్రకటించుకుందని అధికారులు తెలిపారు. తమ కమాండర్ జునైద్ మట్టూని హతమార్చినందుకు ప్రతీకారంగానే లష్కరే ఈ దాడికి పాల్పడినట్లు భావిస్తున్నారు. దాడి జరిగిన ప్రాంతం, మట్టూ హతమైన ఎన్‌కౌంటర్ జరిగిన చోటుకు 20 కి.మీ. దూరంలో ఉంది.
Advertisement