ముంబై : అపార్ట్‌మెంట్ పరిసరాలలో వీధికుక్కలను పెంచుతున్నారన్న కారణంగా అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్న ఇద్దరికి 3,60,000 రూపాయలు జరిమానా విధించారు నిర్వాహకులు. ఈ సంఘటన ముంబైలోని కందివాలిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కందివాలిలోని మహావీర్ నగర్ ‘నిసర్గ్ హెవెన్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటిడ్’లో నివాసముంటున్న నేహా దత్వాని, కేతన్ షాలు అపార్ట్‌మెంట్ ఆవరణలో వీధికుక్కలను పెంచుతున్నారన్న నెపంతో అపార్ట్‌మెంట్ నిర్వాహకులు వారికి భారీ జరిమానా విధించారు. రోజుకు 2500 రూపాయల చొప్పున మొత్తం 3,60,000 రూపాయలు చెల్లించాలని నోటీసులు ఇచ్చారు. నోటీసులు అందడంతో ఆ ఇద్దరు అవాక్కయ్యారు. అపార్ట్‌మెంట్ నిర్వహణ ఖర్చులన్నింటిని వాయిదా వేయకుండా చెల్లిస్తున్నామని, ఇలా కుక్కలకు ఆహారం పెడుతున్న కారణంగా జరిమానా కట్టమంటే కుదరదని నేహా, కేతన్‌లు చెబుతున్నారు. ఈ విషయంపై అపార్ట్‌మెంట్ ఛైర్మన్ మితేష్ ఓరాను ప్రశ్నించగా...‘‘అపార్ట్‌మెంట్స్‌లో మొత్తం 198 ప్లాట్స్ ఉన్నాయి.
వీధికుక్కలు తమని ఇబ్బంది పెడుతున్నాయని, అపార్ట్‌మెంట్ సభ్యులనుంచి పలు ఫిర్యాదులు అందాయి. క్లీనింగ్ చేసే వాళ్లు సైతం కుక్కలకు భయపడుతున్నారు. ముఖ్యంగా ఆడకుక్కలు దాడి చేయడానికి వస్తున్నాయని భయపడుతున్నారు. అందుకే ఎవరైతే వీధి కుక్కలకు ఆహారం పెడతారో వాళ్లు ఖచ్చితంగా రోజుకు 2,500 రూపాయలు జరిమానా కట్టాల్సిందేనని, అపార్ట్‌మెంట్ సభ్యులందరం తీర్మానించాము’అని తెలిపారు. సామాజిక హక్కుల కార్యకర్త పరి మెహ్తా మాట్లాడుతూ.. ‘‘వీధికుక్కలు అవి పుట్టిన ప్రాంతంనుంచి బయటకు రావటానికి ఇష్టపడవు. చాలా తక్కువ సందర్భాలలోనే ప్రాంతాన్ని విడిచిపెడతాయి. వాటిని వాటి ప్రాంతంనుంచి దూరంగా తీసుకెళ్లి ఆహారం పెట్టడం కుదరదు. వాటిని అక్కడినుంచి బయటకు పంపితే ఇతర కుక్కల దాడిలో మరణించే అవకాశం ఉంది. జంతు సంరక్షణా, పరిరక్షణ చట్టం 2001 ప్రకారం ఏ జంతువుకు హాని కలిగించినా అది చట్టరిత్యా నేరమే’’నని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment