ప్రతీకాత్మకచిత్రం
లక్నో : ఉత్తర్‌ప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్‌లో అందరూ విస్తుపోయే ఘటన చోటుచేసుకుంది. వివాహితులైన ఇద్దరు యువతులు ఏకంగా తమ భర్తలకు విడాకులిచ్చి జంటగా మారారు. ఆ ఇద్దరు యువతులు గతంలో కళాశాలలో చదువుకునే సమయంలోనే ప్రేమలో పడ్డారు. ఆరేళ్ల తర్వాత శనివారం ఓ ఆలయంలో స్నేహితులు, తమ న్యాయవాది ఎదుట వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కాగా, వీరి వివాహాన్ని ధ్రువీకరించేందుకు రిజిస్ట్రార్ నిరాకరించారు. స్వలింగ సంపర్కం నేరం కాదంటూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చినప్పటికీ, వారి వివాహాన్ని ఏ చట్టం కిందా గుర్తించలేమని ఆయన అన్నారు.
హమీర్‌పూర్‌కు చెందిన ఇద్దరు యువతులు ఆరేళ్ల క్రితం కళాశాలలో మొదటిసారి కలుసుకుని తొలిపరిచయంలోనే ప్రేమలో పడ్డారు. వీరి ప్రేమ గురించి యువతుల ఇళ్లలో తెలియడంతో అర్ధంతరంగా చదువుకు స్వస్తిపలికీ, ఇద్దరికీ వేర్వేరుగా వివాహాలు జరిపించారు. వారు విడిపోయి ఆరేళ్లు గడిచినా ఒకరిని విడిచి ఒకరు ఉండలేమంటూ వారు తమ భర్తల నుంచి విడాకులు తీసుకుని ఏకంగా వివాహం చేసుకున్నారు. సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో వీరి వివాహాన్ని గుర్తించాలని కోరుతూ తాము న్యాయపోరాటం చేస్తామని యువతుల తరపు న్యాయవాది పేర్కొన్నారు. తాము కట్టుకున్న భర్తల నుంచీ భరణం కూడా ఆశించడం లేదని, ప్రేమను నిలబెట్టుకునేందుకు తాము ఒక్కటయ్యామని ఆ యువతులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment