
భార్యాభర్తల్లా ఉంటాం ప్లీజ్.. పోలీసులు అవాక్కు
మధుర: ఉత్తరప్రదేశ్‌లోని మధుర పోలీసులకు ఒక వింత సమస్య ఎదురైంది. తామిద్దరం ఒకరిని విడిచి ఒకరం ఉండలేమని దంపతుల్లాగా కలిసుంటామని అందుకు తమకు సహాయం చేయాలంటూ ఒక పెళ్లై భర్తతో విడిపోయిన యువతి, మరో విద్యార్థిని పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. తమ కోరిక నెరవేర్చకుంటే ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించారు. దీంతో అప్పటికే వారిద్దరి విన్నపానికి ససేమిరా అంటూ చివాట్లు పెడుతున్న తల్లిదండ్రులను పోలీసులు స్టేషన్‌కు పిలిపించారు.
మధురలోని రెండు పక్కపక్క గ్రామాలకు చెందిన వీరు ఒకే కులానికి చెందినవారు. తాము చాలా రోజులగా ప్రేమించుకుంటున్నామని, ఈ విషయం తల్లిదండ్రులకు తెలిసి తనను బాగా కొడుతున్నారని మీరా(పేరు మార్చాం) అనే ఆమె చెప్పింది. ఎలాగైనా తాము పెళ్లి చేసుకుంటామని, అందుకు తమకు సహాయం చేయాలని లేదంటే ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించారు. తల్లిదండ్రులు మాత్రం అందుకు నిరాకరించారు. దీంతో ఈ విషయంపై ఎలా ముందుకు వెళ్లాలని ఆ పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.