
కలిసుంటామని కోర్టుకెళ్లారు
కేకే.నగర్: సహజీవనానికి అనుమతివ్వాలని కోరుతూ బెంగళూరుకు చెందిన ఇద్దరు యువతులు మంగళవారం తమిళనాడులోని మదురై జిల్లా కోర్టును ఆశ్రయించారు. బెంగళూరు వివేక్‌నగర్‌కు చెందిన వరుణ్ అలియాస్ వినోనికా(22), ఇదే ప్రాంతానికి చెందిన మాలిని (19) ఇద్దరూ అదే ప్రాంతంలోని ఒక షాపింగ్ మాల్లో పనిచేస్తున్నారు. వినోనికా చిన్నతనం నుంచి తనను పురుషుడిగా భావించుకుని పెరిగింది.
గత ఏడాది వినోనికా, మాలిని మధ్య స్నేహం ఏర్పడి అది ప్రేమగా మారింది. వీరి ప్రేమకు ఇరు కుటుంబాల సభ్యులు, బంధువులు వ్యతిరేకత తెలిపారు. దీంతో ఇద్దరూ నాలుగు నెలల క్రితం ఇంటి నుంచి పారిపోయారు. వేలాంకన్నికి చేరిన ఈ ఇరువురు గది తీసుకుని సహజీవనం చేశారు. ఇది తెలుసుకున్న వారి తల్లిదండ్రులు బెంగళూరు నుంచి వచ్చి వారిని ఇళ్లకు తీసుకోని వెళ్లారు. ఈ క్రమంలో ఒక రోజు అకస్మాతుగా బెంగళూరు రైల్వేస్టేషన్ లో ఇటీవల కలుసుకున్నారు. ఆ సమయంలో ఎలాంటి సమస్య ఎదురైనా తాము చివరి వరకు కలిసి ఉండాలని ఒక నిర్ణయానికి వచ్చారు. అక్కడి నుంచి చెన్నైకు వచ్చారు.
చెన్నైలో తాము కలసి జీవించడానికి తగిన సౌకర్యాలు లేవని అనుకున్న ఇద్దరూ మధురైకు చేరుకున్నారు. మధురైలోని హిజ్రా భారతి కన్నమ్మ గురించి తెలుసుకుని ఆమెను ఆశ్రయించారు. తాము ఇద్దరూ సహజీవనం సాగించడానికి సహాయం చేయమని భారతి కన్నమ్మను కోరారు. ఆమె మంగళవారం మధురై జిల్లా న్యాయమూర్తి వద్దకు సమస్యను తీసుకొచ్చారు.