పరుగుపందేలకు వచ్చారు ప్రాణాలు వదిలారు
సాక్షి, ముంబై: పోలీసుశాఖలో ఉద్యోగం సంపాదించుకోవాలని గంపెడాశతో ముంబైకి వచ్చిన ఇద్దరు యువకులు తమ కల నెరవేరకుండానే పైలోకానికి వెళ్లారు. మైదానంలో నిర్వహించే పరీక్షలు ఎంతో కఠినమైనప్పటికీ ఉద్యోగం సంపాదించుకోవడమే లక్ష్యంగా పెట్టుకుని ఇంటర్వ్యూ కోసం ముంబైకి వచ్చి విగత జీవులయ్యారు. బుధవారం విక్రోలిలోని కన్నంవార్ మైదానంలో పరుగు తీస్తుండగా మార్గమధ్యలోనే ఒక యువకుడు కుప్పకూలిపోయాడు. మరో అభ్యర్థి ఇలాగే ఆదివారం ఏరోలిలోని పట్నీగ్రౌండ్‌లో పరుగులు తీస్తుండగా స్పృహతప్పి పడిపోయాడు.
అతన్ని వాషిలోని కార్పొరేషన్ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ బుధవారం మరణించాడు. వీరిని మాలేగావ్ నుంచి వచ్చిన అంబాదాస్ సోనావణే (23), విరార్‌కు చెందిన ప్రసాద్ మాలీ (19)గా గుర్తించారు. ప్రస్తుతం పోలీసు శాఖలో ఉద్యోగాల భర్తీ సాగుతోంది. రాష్ట్రం నలుమూలల నుంచి సుమారు ఐదు లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల పరిశీలన తరువాత అర్హులైన అభ్యర్థులను దశల వారీగా ఇంటర్వ్యూలకు ఆహ్వానించారు.
అందులో భాగంగా నగరం, శివారు ప్రాంతాల్లో ఈ నెల ఆరో తేదీ నుంచి వేర్వేరు మైదానాల్లో శారీరకదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. బాగా ఎండ ఉండడంతోపాటు ఐదు కిలోమీటర్ల దూరం పరుగెత్తాల్సి ఉండడంతో చాలా మంది సొమ్మసిల్లి పడిపోతున్నారు.