
ములుగు(గజ్వేల్): సరదా కోసం ఈతకు వెళ్లిన ఇద్దరు యువకులు నీటమునిగి మృత్యువాత పడ్డారు. ఈ ఘటన ఆదివారం సిద్దిపేట జిల్లా ములుగు మండలంలోని కొండపోచమ్మ సాగర్ వద్ద చోటుచేసుకుంది. గజ్వేల్ ఏసీపీ రమేశ్ తెలిపిన మేరకు.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులుగా పనిచేస్తున్న సికింద్రాబాద్‌కు చెందిన బోయిన్‌పల్లి మల్లికార్జున నగర్ కాలనీకి చెందిన రాజన్‌శర్మ (27), కూకట్‌పల్లి కేపీహెచ్‌బీ కాలనీ రోడ్ నంబర్ – 4 మహవీర్ టవర్‌కు చెందిన వండ్లముడి అక్షయ్‌వెంకట్(28), రామ్‌కోఠికి చెందిన రుషబ్‌షాలు మిత్రులు.
ఈ ముగ్గురూ ఆదివారం సరదాగా గడిపేందుకు కొండపోచమ్మ సాగర్ వద్దకు కారులో చేరుకున్నారు. వారు కట్టపై కొద్దిసేపు సరదాగా గడిపిన అనంతరం అక్షయ్‌వెంకట్, రాజన్‌శర్మ సాగర్‌లో ఈతకోసం వెళ్లి ప్రమాదవశాత్తు అందులోనే మునిగి మృతిచెందారు. సమాచారమందుకున్న గజ్వేల్ ఏసీపీ రమేశ్, గజ్వేల్ రూరల్ సీఐ కమలాకర్, ములుగు, మర్కూక్ ఎస్‌ఐలు రంగకృష్ణ, శ్రీశైలం సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే గజ ఈతగాళ్లను రప్పించి ఇద్దరి మృతదేహాలను వెలికి తీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని మృతదేహాలకు గజ్వేల్ మార్చురీలో పోస్టుమార్టం నిర్వహించినట్లు ములుగు ఎస్‌ఐ రంగకృష్ణ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment