ముంబై : మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే శాసన మండలి సభ్యునిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు గురువారం అధికారిక ప్రకటన వెలువడింది. ఆయనతోపాటు మరో 8 మంది సభ్యులు కూడా ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవంగా విజయం సాధించారు. కాగా, మహారాష్ట్రలో ఖాళీగా ఉన్న తొమ్మిది ఎమ్మెల్సీ స్థానాలకు ఈసీ ఎన్నికలు నిర్వహించింది. ఇందులో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల నుంచి అయిదుగురు, బీజేపీకి చెందిన నలుగురు పోటీలో నిలిచారు. సరిగ్గా తొమ్మిది మంది బరిలో నిలవడంతో.. వీరి ఎన్నిక ఏకగ్రీవమైంది. అయితే గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో.. మొత్తం తొమ్మిది మంది ఏకగ్రీవంగా గెలుపొందినట్టు అధికారులు ప్రకటించారు. (చదవండి : జిల్లాల్లో గోవా మోడల్ అనుసరించండి: ఉద్ధవ్ ఠాక్రే)
కాగా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఉద్ధవ్ నేతృత్వంలోని శివసేన.. బీజేపీతో కలిసి ఎన్నికల బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఎప్పటిలాగానే ఉద్ధవ్ పోటీకి దూరంగా ఉన్నారు. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల కూటమి తరఫున గతేడాది నవంబర్ 28న ఉద్ధవ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దీంతో ఉద్ధవ్ సీఎంగా కొనసాగాలంటే.. మే 27లోపు ఉద్ధవ్ ఎమ్మెల్యేగా గానీ, ఎమ్మెల్సీ గానీ గెలుపొందాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో జరిగిన మండలి ఎన్నికల్లో ఎలాంటి పోటీ లేకుండా ఉద్ధవ్ శాసన మండలిలోకి అడుగుపెట్టారు. దీంతో ఉద్ధవ్ సీఎం పదవి నుంచి దిగిపోనున్నారని కొంతకాలంగా జరుగుతున్న ప్రచారానికి పూర్తి స్థాయిలో తెరపడింది.
Comments
Please login to add a commentAdd a comment