
ఉద్ధవ్ ఠాక్రే
మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో శివసేన పార్టీకి పూర్తి మెజార్టీ వచ్చే అవకాశం లేకపోవడంతో ఆ పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే ముందుగా అనుకున్నట్లు ముఖ్యమంత్రి కాలేరు. రాష్ట్రంలో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రావడంలేదు. దాంతో ఉద్ధవ్ ఠాక్రే పాత్ర కీలకంగా మారింది. చిరకాల మిత్రపక్షం, ఈ ఎన్నికలలో విడిపోయి పోటీ చేసిన బీజేపీకి మద్దతు ఇస్తామని ఆయన స్పష్టంగా చెప్పడంలేదు. ఒక మెలిక పెడుతున్నారు. మహారాష్ట్ర కోసం పనిచేసే ఎవరితోనైనా కలుస్తామని చెప్పారు.
బీజేపి అతి పెద్దపార్టీగా అవతరిస్తున్నప్పటికీ, ఎవరి మద్దతులేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. దాంతో శివసేన మద్దతు కోరక తప్పని పరిస్థితి. ఈ అవకాశాన్ని ఉద్ధవ్ తప్పనిసరిగా ఉపయోగించుకుంటారు. బీజేపీ నేతలను తన దగ్గరకే రప్పించుకుంటారు. ముఖ్యమంత్రి పదవి ఎటూ దక్కే అవకాశం లేకపోవడంతో ఉప ముఖ్యమంత్రి పదవి అడిగే అవకాశం ఉంది. అయితే ఏ విషయం స్పష్టంగా చెప్పడంలేదు. శివసేన అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ మాట్లాడుతూ ఫలితాలు పూర్తిగా వెలువడిన తరువాత మాత్రమే పొత్తుల విషయం మాట్లాడతామని చెప్పారు.
ఇదిలా ఉంటే, పది స్థానాలలో విజయం సాధించి, 30 స్థానాలలో ఆధిక్యతలో ఉన్న ఎన్సీపి పొత్తుకు సిద్ధంగా ఉన్నట్లు అటు బీజేపీకి, ఇటు శివసేనకు సంకేతాలు పంపినట్లు తెలుస్తోంది. అయితే ఎన్సీపితో పొత్తు పెట్టుకునే ప్రసక్తిలేదని బీజేపీ ఇప్పటికే ప్రకటించింది.
ఈ నేపధ్యంలో ప్రభుత్వం ఏర్పాటు విషయమై ఈ సాయంత్రం బీజేపి నేతలు ఉద్ధవ్ ఠాక్రేను కలవనున్నారు. బీజేపి, శివసేనలది 25 ఏళ్ల బంధం. ఉద్ధవ్ ఎన్ని మెలికలు పెట్టినా, శివసేన మద్దతుతో బీజేపి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. బీజేపీ నేత ముఖ్యమంత్రి, ఉద్ధవ్ ఉప ముఖ్యమంత్రి అవుతారని భావిస్తున్నారు.
**