
జామియా మిలియా వర్సిటీలో విద్యార్ధులపై పోలీసు చర్యను మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఖండించారు.
ముంబై : జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ క్యాంపస్‌లో ఢిల్లీ పోలీసుల చర్యను మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే తీవ్రంగా ఖండించారు. వర్సిటీలో పోలీసుల దమనకాండను జలియన్ వాలాబాగ్ ఊచకోతతో పోల్చారు. యువశక్తి బాంబు వంటిదని, దానితో చెలగాటం తగదని హెచ్చరించారు. మహారాష్ట్రలో అధికార పంపకంపై గతంలో మిత్రపక్షాలుగా ఉన్న బీజేపీ, శివసేన వైరిపక్షాలుగా మారిన సంగతి తెలిసిందే. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ జామియా వర్సిటీ విద్యార్ధుల నిరసన హింసాత్మకంగా మారడంతో పోలీసులు క్యాంపస్‌లోకి ప్రవేశించి వారిపై అమానుషంగా ప్రవర్తించిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది.
మరోవైపు తాము శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే పోలీసులు క్యాంపస్‌లోకి చొచ్చుకువచ్చి తమను అకారణంగా చితకబాదారని విద్యార్ధులు చెబుతున్నారు.పోలీసులు తమపై లాఠీచార్జ్‌కు దిగడంతో పాటు భాష్పవాయుగోళాలను ప్రయోగించి క్యాంపస్‌లో భయోత్పాతం సృష్టించారని ఆరోపించారు. జామియా మిలియా క్యాంపస్‌లో పోలీసుల దమనకాండకు నిరసనగా దేశవ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తాయి.