దావూద్ చిరునామా దొరికింది.. | UN panel finds 6 addresses of Dawood in Pakistan valid, 3 incorrect | Sakshi
Sakshi News home page

దావూద్ చిరునామా దొరికింది..

Published Tue, Aug 23 2016 4:35 PM | Last Updated on Mon, Sep 4 2017 10:33 AM

దావూద్ చిరునామా దొరికింది..

దావూద్ చిరునామా దొరికింది..

అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్‌లోనే తలదాచుకుంటున్నట్లు నిర్థారణ అయింది.

కరాచీ: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్‌లోనే తలదాచుకుంటున్నట్లు నిర్థారణ అయింది. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి ప్రత్యేక బృందం నిగ్గు తేల్చిన వాస్తవమిది. పాకిస్థాన్‌లోని ఆరు ప్రాంతాల్లో దావూద్‌కు ఇళ్లు ఉన్నాయని ఐక్యరాజ్యసమితి బృందం నిర్థారించింది. ఈమేరకు దావూద్ నివాసాలకు సంబంధించి భారత్‌ సమర్పించిన 9 చిరునామాల్లో 6 సరైనవేనని ఐరాస ప్రత్యేక బృందం తేల్చింది. మూడు చిరునామాలు మాత్రం తప్పని పేర్కొంది.

యూఎన్ఓ వ్యాఖ్యలతో దావూద్‌కు పాకిస్థాన్ ఆశ్రయం కల్పిస్తూ వస్తోందని భారత్ చేస్తున్న వాదనలకు మరింత బలం చేకూరినట్లైంది. పాకిస్థాన్‌లో దావూద్ నివాసాలకు సంబంధించి భారత నిఘా సంస్థలు కచ్చితమైన ఆధారాలు సంపాదించాయి. ఆ సమాచారాన్ని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, పాకిస్థాన్ విదేశాంగ కార్య దర్శి  సర్తాజ్ అజీజ్‌కు అందచేశారు. అలాగే ఐక్యరాజ్యసమితి ప్రత్యేక బృందానికి కూడా ఆ సమాచారాన్ని చేరవేశారు. భారత్ అందించిన ఆధారాలను ప్రత్యేక బృందం నిశితంగా పరిశీలించింది. అనంతరం దావూద్ పాకిస్థాన్‌లోనే ఉన్నాడని నిర్దారించింది.

కాగా 1993లో ముంబై పేలుళ్లకు దావూద్ ప్రమేయం ఉన్నట్లు తేలడంతో అతడు భారత్ నుంచి పరారయ్యాడు. ముంబై నుంచి మకాం ఎత్తేసి విదేశాలకు పారిపోయాడు. కొన్నాళ్లు దుబాయ్‌లో తలదాచుకున్నాడని, తర్వాత పాకిస్థాన్‌లోని కరాచీలో నివాసం ఏర్పరచుకున్నాడని, పాక్ ఇంటెలిజెన్స్ సంస్థ ఐఎస్‌ఐ అతడికి సహకరిస్తోందని వార్తలు వచ్చాయి. ఆ కథనాలు వెలువడిన వెంటనే దావూద్ పాకిస్థాన్‌లోనే ఉన్నాడని తమ వద్ద ఆధారాలు ఉన్నాయని, అతడి అప్పగింత కోసం పాకిస్థాన్ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని భారత హోంశాఖ ప్రకటించింది. అయితే, పాకిస్థాన్ ప్రభుత్వం మాత్రం అతడు తమ దేశంలో లేనే లేడంటూ ఆ వార్తలను ఖండించిన విషయం తెలిసిందే.

మరోవైపు దావూద్ ఇబ్రహీం భారత్‌కు మాత్రమే కాదు, అంతర్జాతీయ భద్రతా సంస్థలకు కూడా ‘బాగా కావాల్సిన’ (మోస్ట్ వాంటెడ్) నేరగాడు. ముంబైలో 1993లో జరిగిన పేలుళ్లకు ఆర్థిక సహకారం అందించడమే కాకుండా, పేలుళ్ల కుట్రలో కీలక పాత్ర పోషించినందుకు ఇతడిపై కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత 2008లో జరిగిన ముంబై పేలుళ్లు సహా పలు ఉగ్రవాద చర్యల్లో దావూద్ పాత్ర ఉన్నట్లు భారత్, రష్యా ఇంటెలిజెన్స్ సంస్థలు ఆధారాలు సేకరించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement