న్యూఢిల్లీ: అన్‌రిజర్వ్‌డ్ రైల్వే టికెట్లను యూటీఎస్ (అన్‌రిజర్వుడ్ టికెటింగ్ సిస్టమ్)మొబైల్ యాప్ ద్వారా కొనుగోలు చేసే సదుపాయాన్ని నవంబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా అందుబాటులోకి తేనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఈశాన్య సరిహద్దు, పశ్చిమ మధ్య రైల్వే జోన్లలో మినహా మిగిలిన 15 జోన్లలో ఇప్పటికే ఈ పథకం అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. ప్రయాణికుల సౌకర్యార్దం రైల్వే శాఖ నాలుగేళ్ల క్రితం ముంబైలో ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది.
అనంతరం ఢిల్లీ–పల్వాల్, చెన్నై నగరాలకు దీనిని విస్తరించింది. నాలుగేళ్లలో సుమారు 45 లక్షలు మంది వినియోగదారులు ఈ యాప్ ద్వారా తమ పేరును నమోదు చేసుకున్నారని రైల్వే శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ యాప్ ద్వారా రోజుకు సగటున 87వేల టికెట్లను కొనుగోలు చేస్తున్నారని, అంతేకాకుండా అన్‌రిజర్వ్‌డ్ టికెట్ల అమ్మకాల వల్ల రైల్వే శాఖ రోజుకు రూ.45 లక్షలు ఆర్జిస్తోందని వెల్లడించారు. ఈ యాప్ ద్వారా ఫ్లాట్‌ఫాం టికెట్లు, నెలవారీ పాసులను సైతం కొనుగోలు చేయవచ్చని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment