
కొత్త రూల్స్‌తో భర్తీకాని మెడికల్ సీట్లు
వైద్య విద్యకున్న డిమాండ్ అంతా ఇంతా కాదు. లక్షలు కుమ్మరించైనా వైద్యులు అనిపించుకునేందుకు విద్యార్థులు, తల్లితండ్రులు ఎంత ఖర్చుకైనా వెనుకాడటం లేదు.
సాక్షి, న్యూఢిల్లీ : వైద్య విద్యకున్న డిమాండ్ అంతా ఇంతా కాదు. లక్షలు కుమ్మరించైనా వైద్యులు అనిపించుకునేందుకు విద్యార్థులు, తల్లితండ్రులు ఎంత ఖర్చుకైనా వెనుకాడటం లేదు. అయితే సుప్రీంకోర్టు ఉత్తర్వులతో ఏకీకృత కౌన్సెలింగ్ జరుగుతున్న క్రమంలో నూతన మార్గదర్శకాల కింద ప్రయివేట్ వైద్య కళాశాలల్లో సీట్లు భర్తీ కావడం లేదు.
మూడవ విడత కౌన్సెలింగ్ ముగిసిన నేపథ్యంలో డీమ్డ్ యూనివర్సిటీలు, ప్రయివేటు కాలేజీల్లో 50 శాతం పైగా ఎంబీబీఎస్, డెంటల్ సీట్లు ఇంకా ఖాళీగా ఉండటం గమనార్హం. ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ఈనెల 28 చివరి తేదీ కాగా, అడ్మిషన్ ప్రక్రియ ఈనెల 30న ముగుస్తుంది. దీంతో నూతన నిబంధనలతో మెజారిటీ సీట్లు భర్తీ కావేమోనని ఈ సంస్థలు ఆందోళన చెందుతున్నాయి.
తాజా మార్గదర్శకాల ప్రకారం ఈ వర్సిటీలు తాము స్వయంగా విద్యార్ధులను చేర్చుకోవడానికి అనుమతించారు. మరోవైపు ప్రభుత్వ వైద్య కళాశాలల్లోనూ ఆల్ ఇండియా కోటా కింద 15 శాతం సీట్లు ఇప్పటికీ ఖాళీగా ఉన్నాయని అధికారులు చెప్పారు. ఇప్పటివరకూ ఒక్క సీటూ భర్తీ కాని డీమ్డ్ యూనివర్సిటీలు ఉన్నాయని చెబుతున్నారు.
నీట్ నేపథ్యంలో తలెత్తిన ఈ గందరగోళానికి తెరదించేందుకు అధికారులు తలలు పట్టుకున్నారు. ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు కౌన్సెలింగ్ చేపట్టామని, భర్తీకాని సీట్ల విషయంలో ఎలాంటి మార్పులు చేసే పరిస్థితి లేదని ఆరోగ్య సేవల డైరెక్టర్ జనరల్‌కు చెందిన ఓ సీనియర్ అధికారి పేర్కొన్నారు. దీనిపై న్యాయనిపుణులతో సంప్రదించి మరోసారి కోర్టును ఆశ్రయిస్తామని, లేనిపక్షంలో ఈ ఏడాది 12,000 వైద్య సీట్లు భర్తీ కావని చెప్పారు.