బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగర్ భార్య సంగీత
లక్నో : ఉత్తరప్రదేశ్ ఉనావో ప్రాంతంలోని యువతిపై అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎమెల్యే కుల్దీప్ సింగ్ సెంగర్ మెడకు ఉచ్చు బిగుసుకుంటోంది. ఈ నేపథ్యంలో ఆయన భార్య సంగీత మీడియా ముందుకు వచ్చారు. రాజకీయ కుట్రలో భాగంగా తన భర్తను అత్యాచార కేసులో ఇరికించారని సంగీత ఆరోపించారు. తన భర్త అమాయకుడని, బీఎస్పీ, ఎస్పీ పార్టీలు ఆయనపై నిందలు వేసి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిని కలిసి తన భర్తకు న్యాయం చేయాల్సిందిగా కోరతానని ఏఎన్‌ఐ వార్తా సంస్థతో చెప్పారు.
కుల్దీప్ విషయంలో మీడియా అత్యుత్సాహం చూపుతోందని, ఆయనపై కేవలం ఆరోపణలు మాత్రమే వచ్చాయని.. కానీ మీడియా కుల్దీప్‌ను దోషిగా నిర్దారించేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కారణంగా తమ కుటుంబమంతా ఎంతో ఆవేదన చెందుతోందన్నారు. మీడియాలో తండ్రి గురించి వచ్చిన వార్తలు చూసి తమ ఇద్దరు కుమార్తెలు గది నుంచి బయటకు రావడంలేదని, అన్నం కూడా తినడం లేదని వెల్లడించారు. ఒకవేళ తన భర్త దోషి అని తేలితే కుటుంబమంతా కలిసి ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. తన భర్తపై అసత్యపు ఆరోపణలు చేసిన అమ్మాయికి, ఆమె మావయ్యకు నార్కో అనాలసిస్ పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
ఇదిలావుంటే.. ఉనావో అత్యాచార బాధితురాలికి న్యాయం చేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో బుధవారం ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలైంది. అధికార పార్టీ అండదండలతోనే యువతి తండ్రిని జైల్లో కొట్టి చంపారని న్యాయవాది మనోహర్ లాల్ శర్మ తన పిల్‌లో పేర్కొన్నారు. ఈ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)తో సమగ్ర విచారణ జరిపించాలని ఆయన సుప్రీం కోర్టును అభ్యర్థించారు.
Comments
Please login to add a commentAdd a comment