నేను టోల్ ఫీజు కట్టను.. అంతే...
సాక్షి, మధుర: పార్టీలో సీనియర్ నేత.. పైగా ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడిన ప్రతినిధి. నిబంధనలు అతిక్రమించటంతో మీడియా ప్రశ్నల మీద ప్రశ్నలు గుప్పించింది. అంతే సహనం కోల్పోయిన ఆయన తన ఆధిపత్యం ప్రదర్శించుకునేందుకు అరిచేశారు. ఉత్తర ప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మహేంద్ర నాథ్ పాండే చేసిన నిర్వాకం ఇది...
చందౌలి నియోజకవర్గం ఎంపీ అయిన మహేంద్ర నాథ్‌కు ఈ మధ్యే యూపీ బాధ్యతలను అప్పజెప్పింది అధిష్ఠానం. తాజాగా దీన్‌దయాల్ ధామ్‌లో నిర్వహించిన దీనదయాల్ ఉపాధ్యాయ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే తన అనుచురలతో భారీ కాన్వాయ్‌లో విచ్చేసిన ఆయన మార్గం మధ్యలో ఫిరోజాబాద్ వద్ద టోల్ గేట్ ఫీజు చెల్లించకుండానే వచ్చేశారు. దీంతో విషయం తెలుసుకున్న మీడియా కార్యక్రమం అనంతరం ఈ వ్యవహారంపై మహేంద్రను ప్రశ్నించింది.
అయితే ఊహించని ప్రశ్నకు బిత్తరపోయిన ఆయన ‘నేనొక ఎంపీని. టోల్ ఫీజు చెల్లించాల్సిన అవసరం నాకు లేదు. ఇంకేమైనా ప్రశ్నలున్నాయా?’ అంటూ వ్యాఖ్యానించారు. వెంటనే మీడియా ప్రతినిధులు.. మీరు పార్లమెంటేరియన్ కావొచ్చుగానీ, మీతో ప్రయాణించిన మిగతా వాళ్లు కాదుగా అనటంతో ఎంపీకి పట్టరాని కోపం వచ్చేసింది. ప్రస్తుతం తాను దీన్‌దయాళ్ ధామ్ వద్ద ఉన్నానని.. కార్యక్రమానికి సంబంధించిన ప్రశ్నలు ఏవైనా ఉంటే అడగండంటూ కాస్త అసహనంగానే ఆయన మాట్లాడారు. కానీ, తమకు ఆ ప్రశ్నకే సమాధానం కావాలని మీడియా పట్టుబట్టడంతో... అది తప్ప మరేదైనా అడగండి అంటూ మహేంద్ర కోరారు.
గతంలో అఖిలేష్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బారాబంకీ వద్ద ఫీజు చెల్లించకుండానే 175 కార్లతో టోల్ గేట్ దాటి వెళ్లిపోగా, అఖిలేష్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వినిపించాయి.