‘టోల్ ఫ్రీ’ ఎన్నికల వాగ్దానం కాదు | Toll-free Maharashtra concept is not just poll promise claims CM Fadnavis | Sakshi
Sakshi News home page

‘టోల్ ఫ్రీ’ ఎన్నికల వాగ్దానం కాదు

Published Sat, Feb 7 2015 11:28 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

Toll-free Maharashtra concept is not just poll promise claims CM Fadnavis

సాక్షి, ముంబై: ‘టోల్ ముక్త్ (టోల్‌లేని) మహారాష్ట్ర’ అన్నది ఒక భావన మాత్రమేనని, అది బీజేపీ ఎన్నికల వాగ్దానం కాదని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పష్టం చేశారు. శనివారంతో తన ప్రభుత్వం వంద రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన ఇతర మంత్రులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అత్యధికంగా ఉన్న టోల్ చార్జీలను తగ్గించాలన్న అభిప్రాయంతో ప్రభుత్వం ఉందన్నారు. ఒప్పందాలన్నీ ఏకపక్షగా ఉన్నాయని, తిరిగి వెనక్కు తీసుకునే అవకాశం లేదని చెప్పారు.

అటువంటి ఒప్పందాలపై దర్యాప్తు జరుపుతున్నామని తెలిపారు. రైతుల ఆత్మహత్యలకు కూడా పూర్వ కాంగ్రెస్-ఎన్సీపీ ప్రభుత్వమే కారణమన్నారు. పదిహేనేళ్ల దుష్పరిపాలన కారణంగా అస్తవ్యస్తంగా మారిన రాష్ట్ర పగ్గాలను తాము చేపట్టామని ముఖ్యమంత్రి అన్నారు. పాత ప్రభుత్వ దుశ్చర్యల కారణంగా పారిశ్రామిక, వ్యవసాయ సేవా రంగాలు, రాష్ట్రం వెనుకబడి పోయాయని అన్నారు. విధానాల రూపకల్పనలో, నిర్ణయాలు తీసుకోవడంలో, వాటిని అమలు చేయడంలో కూడా గత ప్రభుత్వం నత్తనడక నడిచిందని విమర్శించారు. ఈ ధోరణిని గత వంద రోజుల్లో తాము వేగవంతం చేశామని చెప్పుకున్నారు. జవాబుదారీతనంతో కూడిన అధికార వికేంద్రీకరణపై తమ ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించిందని ఫడ్నవీస్ చెప్పారు.

గత పదిహేనేళ్ల కాలంలో వ్యవసాయ, నీటిపారుదల రంగాల్లో ఎటువంటి పెట్టుబడులూ పెట్టలేదని, భారీగా నిధులు వెచ్చించినా ప్రాజెక్టులు పూర్తి కాలేదని ఆరోపించారు. వ్యవసాయ ఉత్పాదకతను, మూల ధన వ్యయాన్ని పెంచడంపై తమ ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించిందని వెల్లడించారు. ఓ ప్రభుత్వ పనితీరును అంచనా వేయడానికి వంద రోజులు చాలా తక్కువ అని అన్నారు. దాని ఉద్దేశ్యాలను బట్టి అంచనా వేయవచ్చని చెప్పారు. ఆ రకంగా తాము సరైన దిశలోనే పయనిస్తున్నామమని అన్నారు. రాష్ట్రంలో 40వేల గ్రామాలుండగా, వాటిలో 24 వేల గ్రామాలు కరువు బారిన పడ్డాయని చెప్పారు.

ముంబైలో 6 వేల సీసీటీవీలు

ముంబైలో సీసీటీవీ ఆధారిత నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు లార్సెన్ అండ్ టూబ్రో సంస్థతో ప్రభుత్వం రూ.949 కోట్ల విలువైన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం ఆ కంపెనీ 2016, సెప్టెంబర్ నాటికి నగరంలో ఆరువేల సీసీటీవీలను ఏర్పాటు చేస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు. 26/11 ఉగ్రవాద దాడులు జరిగినప్పుడు అప్పటి ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రతిపాదించిందని, కానీ అది అమలుకు నోచుకోలేదని అన్నారు.

సీసీటీవీలు నగర పౌరుల భద్రతకు భరోసానివ్వగలవని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. పోలీసులకు శాంతి భద్రతలను కాపాడటంలోనే కాకుండా, ట్రాఫిక్ సమస్యను నివారించేందుకు కూడా అవి తోడ్పడతాయని అన్నారు. మూడు దశల్లో ఈ పనులు జరుగుతాయన్నారు. మొదటి దశలో దక్షిణ ముంబైలో ఈ ఏడాది నవంబర్ నాటికి సీసీటీవీ కెమెరాలు అమర్చే పని పూర్తవుతుందన్నారు. రెండో దశలో ఉత్తర, తూరు ముంబైలో వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి, మూడో దశలో సెంట్రల్, పశ్చిమ ముంబైలో 2016, సెప్టెంబర్ నాటికి పనులు పూర్తవుతాయని చెప్పారు.

వంద రోజుల పాలనపై పుస్తకం విడుదల

వందరోజుల పాలనలో తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన అభివృద్ధి పనులపై ‘100 దివసాచా లేఖాజోఖా’ (వంద రోజుల లెక్కలు) అనే పేరుతో మంత్రులందరూ ఒక పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ పుస్తకం అవిష్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తోపాటు సుభాష్ దేశాయి, పంకజా ముండే, సుధీర్ మునగంటివార్, ఏక్‌నాథ్ శిందే తదితర  ప్రముఖులందరు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement