'ఆయనను దేశద్రోహి అనలేదు'
బాలీవుడ్ నటుడు ఆమిర్‌ఖాన్‌ను 'దేశద్రోహి' అని తాను అనలేదని, అయినప్పటికీ తాను ఆ మాట అన్నట్టు పలు పత్రికలు ప్రచురించాయని బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ శనివారం వివరణ ఇచ్చారు. 'పార్లమెంటు స్థాయీ సంఘం సమావేశంలో నేను ఏం చెప్పానన్నది రహస్యం. స్థాయీ సంఘంలో చేసే వ్యాఖ్యలు బయటకు వెల్లడించడం చట్టవిరుద్ధమవుతుంది. ఆమిర్‌ను ఉద్దేశించి నేను 'దేశద్రోహి' అన్న పదాన్ని ఉపయోగించలేదు. నా జీవితం మొత్తంలో ఆయన గురించి అలాంటి మాట అనలేను. అయినా పరువును దెబ్బతీసేందుకు అలాంటి వ్యాఖ్యలను ప్రతికలు ప్రచురించాయి. అసత్యాలను ప్రచురించినందుకు వాటికి నోటీసులు ఇస్తాను' అని మనోజ్ తివారి పేర్కొన్నారు.
ఆమిర్‌ఖాన్‌ను 'ఇన్‌క్రెడిబుల్ ఇండియా' బ్రాండ్ అంబాసిడర్‌గా తొలగించడాన్ని తప్పుబడుతూ పర్యాటకంపై పార్లమెంటు స్థాయీ సంఘం శుక్రవారం సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో ఆమిర్‌ను ఉద్దేశించి బీజేపీ ఎంపీ మనోజ్ తివారి అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. దీనిపై ప్రతిపక్షాలు ఆయనపై మండిపడ్డాయి. ఈ నేపథ్యంలో వివరణ ఇచ్చిన మనోజ్ తివారి ఆమిర్ 'ఇన్‌క్రెడిబుల్ ఇండియా'కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండరాదని మాత్రమే తాను పేర్కొన్నానని చెప్పారు. అసహనం వివాదం నేపథ్యంలో భారత్ సురక్షిత దేశం కాదని పేర్కొన్న ఆయన దేశ పర్యాటక రంగానికి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండటం సరికాదని తెలిపారు.