అమ్మాయి పుట్టిందని తలాఖ్.. మళ్లీ పెళ్లి!
తన భార్య ఆడబిడ్డకు జన్మనిచ్చిందన్న కోపంతో ఉత్తరప్రదేశ్‌లోని సంభల్ ప్రాంతంలో ఓ భర్త ఆమెకు ట్రిపుల్ తలాఖ్ ఇస్తానని, మళ్లీ పెళ్లి చేసుకుంటానని బెదిరించాడు. అతడు రెండో పెళ్లి చేసుకోవాలనుకుంటున్న విషయాన్ని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు పెళ్లయి నాలుగేళ్లు అయ్యిందని, ఆ తర్వాత ఎనిమిది నెలలకే పుట్టింటికి వచ్చేశానని ఆమె తెలిపింది. వాళ్లు ప్రతిరోజూ తనను కట్నం కోసం కొట్టి, వేధించేవారని, చాలాసార్లు తనను చంపడానికి కూడా ప్రయత్నించారని వాపోయింది. ఇంతలో తనకు అమ్మాయి పుట్టడంతో పరిస్థితులు మరింత దారుణంగా మారాయని, వాళ్లు పాపను కూడా స్వీకరించలేదని, ఇప్పుడు తన భర్త రెండో పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడని చెప్పింది. ట్రిపుల్ తలాఖ్‌ను వీలైనంత త్వరగా రద్దు చేయాలని తాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌లను కోరుతున్నానని తెలిపింది.
ట్రిపుల్ తలాఖ్ ఒక సామాజిక రుగ్మత అని, ఇలాంటివి సామాజిక అవగాహనతోనే అంతమవుతాయని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల అన్నారు. దీని కోసం సమాజంలో విభేదాలు రావాలని బీజేపీ కోరుకోవడం లేదని ఆయన చెప్పారు. కాగా, దేశంలో ఉన్న మౌలానాలు, మసీదుల ఇమాంలు తప్పనిసరిగా శుక్రవారం నమాజ్ సమయంలో కోడ్ ఆఫ్ కండక్ట్‌ను చదవాలని, దాని అమలు గురించి గట్టిగా చెప్పాలని ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఇటీవల కోరింది. షరియత్ చట్టాల్లో ఎవరి జోక్యాన్ని తాము సహించబోమని, తమ చట్టంలో మార్పు రావాలని దేశంలో మెజారిటీ ముస్లింలు కోరుకోవడం లేదని తెలిపింది. ట్రిపుల్ తలాఖ్‌కు వీలైనంత త్వరగా ముగింపు పలకాలని, అది మహాభారతంలో ద్రౌపదీ వస్త్రాపహరణం లాంటిదని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇటీవల అన్నారు.