పంజాబ్ ఉగ్రదాడిపై చర్చించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు పార్లమెంటు ఎగువ సభలో స్పష్టం చేశారు.
న్యూఢిల్లీ: లోక్సభలో సోమవారం విపక్ష సభ్యుల నినాదాలు, నిరసనలు, ఆందోళనలతో అట్టుడికింది. పంజాబ్లో ఉగ్రవాదుల కాల్పుల ఘటనపై ఇవాళ లోక్సభ దద్దరిల్లింది. ఈరోజు ఉదయం సభ ప్రారంభం కాగానే గురుదాస్పూర్ పోలీస్ స్టేషన్పై ఉగ్రవాదుల దాడిపై సభలో ప్రకటన విడుదల చేయాలని ప్రతిపక్ష సభ్యులు పట్టుబడ్డారు. మరోవైపు వ్యాపం, లలిత్ గేట్ వివాదం విపక్షాలు ఆందోళనకు దిగాయి. కాంగ్రెస్ ఎంపీలు పోడియం దగ్గరికి ఆందోళనకు దిగారు. దీంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. తిరిగి సభ సమావేశం కాగానే గురుదాస్ పూర్ ఘటనపై సభ్యులు ఆందోళనకు దిగారు.
దీనిపై కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు జోక్యం చేసుకుని... పంజాబ్ ఉగ్రదాడిపై చర్చించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని సభలో స్పష్టం చేశారు.ఎన్కౌంటర్ కొనసాగుతోందని వివరాలు అందిన తరువాత పూర్తి సమాచారాన్ని సభకు తెలియజేస్తామని ప్రకటించారు. దీనికి సంబంధించి హోం మంత్రి వివరణ ఇస్తారన్నారు. దేశ సమగ్రత, భద్రతకోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
ఇక ఉగ్రదాడిని పసిగట్టడంలో ఇంటిలిజెన్స్ ఏజెన్సీలు విఫలమయ్యాయని కాంగ్రెస్ ఆరోపించింది. "వి వాంట్ జస్టిస్", "మోదీ జవాబ్ దో " అంటూ బ్యానర్లు ప్రదర్శిస్తూ ఆందోళను కొనసాగించారు. పోడియం ముందుకు దూసుకు వచ్చారు. సభలో ఫ్లకార్డులు ప్రదర్శించడాన్ని అంగీకరించేది లేదని స్పీకర్ సుమిత్రా ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు కాల్పుల ఘటనను రాజకీయం చేయొద్దని, టెర్రరిజానికి వ్యతిరేకంగా కలిసికట్టుగా పోరాడాలని మరికొంత మంది సభ్యులు వాదించారు. గురుదాస్ పూర్ చాలా దురదృష్టకరమైన ఘటన, టెర్రరిజాన్ని మట్టుబెట్టేందుకు ప్రభుత్వం కృషి చేయాలని తెలంగాణ ఎంపీ జితేందర్ రెడ్డి పేర్కొన్నారు. విపక్షాల ఆందోళనలు, నిరసనలు కొనసాగుతుండటంతో కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడటంతో స్పీకర్ సమావేశాలను మధ్యాహ్నం 2 గంటల వరకూ వాయిదా వేశారు.
అటు రాజ్యసభ ప్రారంభం అయిన కొద్దిసేపటికే మంగళవారానికి వాయిదా పడింది. సిట్టింగ్ సభ్యుడు కల్పతరు దాస్ మృతికి సంతాపంగా సభ రేపటికి వాయిదా వేశారు.