లోక్‌సభలో హోరాహోరీ | uproar in parliament both sabha..loksabha adjourned up to friday 11am | Sakshi
Sakshi News home page

లోక్‌సభలో హోరాహోరీ

Published Fri, Jul 24 2015 2:47 AM | Last Updated on Tue, Jun 4 2019 8:03 PM

లోక్‌సభలో హోరాహోరీ - Sakshi

లోక్‌సభలో హోరాహోరీ

వరుసగా మూడో రోజూ పార్లమెంటు సమావేశాలు తుడిచిపెట్టుకుపోయాయి. ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ మంత్రులు, ముఖ్యమంత్రులను తొలగిం చనిదే ఎలాంటి చర్చనూ జరగనివ్వబోమని విపక్షాలు భీష్మించుకుంటే, కాంగ్రె స్ నేతలపై ప్రత్యారోపణలతో అధికారపక్షం ఎదురుదాడిని పెంచింది. కాంగ్రెస్ పాలనలోని రాష్ట్రాల అవినీతిని ప్రస్తావిస్తూ బీజేపీ సభ్యులు సైతం  ప్లకార్డులను ప్రదర్శించారు. సోనియాఅల్లుడు రాబర్ట్‌వాద్రాపై బీజేపీ సభాహక్కుల ఉల్లంఘన ఆరోపణలు చేసింది.. ఆయనను సభ ముందుకు రప్పించి శిక్షించాలని డిమాండ్ చేసింది.
 
రాజీనామాల డిమాండ్‌తో వెల్‌లో ప్రతిపక్షాల ఆందోళన
* ప్రతిగా పోడియం వద్దకు దూసుకొచ్చిన బీజేపీ ఆందోళన
* కాంగ్రెస్ ప్లకార్డులకు పోటీగా బీజేపీ ప్లకార్డుల ప్రదర్శన
* రాబర్ట్‌వాద్రా సభా హక్కులు ఉల్లంఘించారంటూ ఆరోపణ
* అధికార-విపక్షాల మధ్య యుద్ధవాతావరణం  
* మూడో రోజూ కొనసాగిన పార్లమెంటు ప్రతిష్టంభన


సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో మూడో రోజు గురువారం లోక్‌సభలో యుద్ధ వాతావరణం నెలకొంది. అధికార, విపక్షాల సభ్యులు ఆవేశాలతో ఊగిపోతూ సభను యుద్ధ క్షేత్రంగా తలపించారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన లోక్‌సభ ఐదు నిమిషాలు కూడా కొనసాగని పరిస్థితి నెలకొంది. తొలుత స్పీకర్ సుమిత్రామహాజన్ వ్యాపమ్, ఐపీఎల్ స్కాంలు తదితర అంశాలపై ప్రతిపక్ష సభ్యులు ఇచ్చిన వాయిదాతీర్మానాలతో పాటు, టీఆర్‌ఎస్ లోక్‌సభ పక్ష నేత జితేందర్‌రెడ్డి ప్రత్యేక హైకోర్టు అంశంపై వాయిదా తీర్మానానికై ఇచ్చిన నోటీసును తిరస్కరించారు.

ఈ సమయంలో యథావిధిగా కాంగ్రెస్ నే తృత్వంలోని పలు విపక్షాలు మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు చేతబట్టుకుని పోడియం వద్దకు దూసుకొచ్చారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అధికార బీజేపీ సభ్యులు కూడా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, ప్లకార్డులు ధరించి తమ స్థానాల నుంచి ముందుకు వచ్చారు.టీఆర్‌ఎస్ సభ్యులు కూడా తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు కావాలంటూ వెల్‌లోకి దూసుకొచ్చారు. ఇదే సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, టీడీపీ ఎంపీ చామకూర మల్లారెడ్డి తమ స్థానాల్లో నిల్చొని ప్రత్యేక హైకోర్టు కోసం ఆందోళన వ్యక్తంచేశారు. ఈ పరిస్థితుల్లో స్పీకర్ ప్రశ్నోత్తరాలను ప్రారంభించినప్పటికీ.. కొన సాగే పరిస్థితి లేకపోవటంతో సభను 12 గంటల వరకు వాయిదా వేశారు.
 
పోటాపోటీగా ప్లకార్డుల ప్రదర్శన...
తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు సభ ప్రారంభం కాగా మునుపటి ఘట్టమే పునరావృతమైంది. ఈ సమయంలో బీజేపీ సభ్యులు కూడా పోడియం సమీపంలోకి దూసుకొచ్చారు. వీరికి మద్దతుగా ఎన్‌డీఏ భాగస్వామ్య పార్టీల సభ్యులు తమ తమ స్థానాల్లో నిలుచుని నినాదాలు చేశారు. రాబర్ట్ వాద్రాకు వ్యవసాయ భూములు కట్టబెట్టి మళ్లీ అవినీతి గురించి కాంగ్రెస్ మాట్లాడడం విడ్డూరంగా ఉందని బీజేపీ సభ్యులు నినాదాలు చేశారు.

‘ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే.. కిసాన్ కా జమీన్ దామాద్ కో బాంటే..’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. అటు కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాల సభ్యులు వ్యాపమ్, లలిత్‌గేట్‌లపై జవాబు చెప్పాలంటూ నినాదాలు చేశారు. ‘బ్రష్టాచార్ కో జయ్ జయ్ కర్‌హై.. యే బేషరమ్ సర్కార్ హై..’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఆ తర్వాత పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి రాజీవ్‌ప్రతాప్‌రూడీతో కలసి ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ తమ పార్టీ సభ్యులను వారి వారి స్థానాలకు వెళ్లేలా ఒప్పించారు.
 
వాద్రాను సభ ముందుకు రప్పించాలి
ఈ గందరగోళం మధ్యే బీజేపీ సభ్యుడు ప్రహ్లాద్‌జోషీ నిలుచుని.. రాబర్ట్ వాద్రా పార్లమెంటు సభ్యులనుఅగౌరవపరిచారని, ఆయనపై సభాహక్కుల ఉల్లంఘన తీర్మానం ప్రవేశపెట్టేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఈ అంశాన్ని సభాహక్కుల కమిటీ దృష్టికి తీసుకెళ్లాలని పట్టుపట్టారు. ‘‘వాద్రా కొద్ది రోజుల కిందట ఫేస్‌బుక్‌లో కొన్ని వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతాయని, దానితో పాటే వారి దృష్టి మళ్లింపు రాజకీయ ఎత్తుగడలు మొదలవుతాయని, దేశ ప్రజలను పిచ్చివాళ్లను చేయలేరని, దేశానికి ఇలాంటి నాయకులునేతృత్వం వహిస్తుండటం పట్ల చింతిస్తున్నానని.. వాద్రా వ్యాఖ్యానించారు.

ఆయన పార్లమెంటులోని సభ్యులనే కాకుండా పార్లమెంటు మొత్తాన్నే కించపరిచారు. పార్లమెంటు ప్రతిష్టను దిగజార్చారు. అందువల్ల వాద్రాను తక్షణం సభకు పిలిపించి మందలించాలి. ఆయనకు శిక్ష పడాలి.’’ అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా తీవ్ర ఆగ్రహం తో తన స్థానం నుంచి లేచి నిల్చొని నిరసన తెలిపారు. దీంతో కాంగ్రెస్ సభ్యులు స్వరాన్ని పెంచుతూ తమ నినాదాలను మరింత ఉధృతం చేశారు.
 
రాజ్యసభలో మారని పరిస్థితి...
ఇక రాజ్యసభలోనూ కాంగ్రెస్‌తో పాటు, వామపక్షాలు, ఇతర ప్రతిపక్ష పార్టీలు తమ ఆందోళనను కొనసాగించాయి. విపక్ష సభ్యులు సుష్మా, రాజే, చౌహాన్‌ల రాజీనామా కోరుతూ వెల్‌లోకి వెళ్లి నినాదాలు చేశారు. ఈ గందరగోళంలో మధ్యాహ్నం 2 గంటల వరకూ సభ రెండుసార్లు వాయిదా పడింది. రెండు గంటల తర్వాత కూడా పరిస్థితిలో మార్పు లేకపోవటంతో డిప్యూటీ చైర్మన్ పి.జె.కురియన్ సభను శుక్రవారానికి వాయిదా వేశారు.
 
నన్ను మాట్లాడనివ్వండి: స్పీకర్
లోక్‌సభలో ఒక దశలో స్పీకర్ సుమిత్రా మహా జన్ లేచి ప్రకటన చేయబోతుండగా విపక్ష సభ్యులు ఏమాత్రం తగ్గకుండా ఆందోళన కొనసాగించారు. దీంతో..‘‘నన్ను మాట్లాడనివ్వండి. మీకు సభ నడవడం ఇష్టం లేకపోతే.. చర్చ జరగడం ఇష్టంలేకపోతే.. సభను వాయిదావేస్తాను...’’ అని పేర్కొన్నారు. దీనికి విపక్ష సభ్యులు ‘‘బీజేపీ సభ్యులు వెల్‌లోకి దూసుకొస్తే మీరేం మాట్లాడరు. కానీ మాపై మీరు మాట్లాడతారు...’’అని వ్యాఖ్యానించారు.

స్పీకర్ బదులిస్తూ.. ‘‘వారి గురించీమాట్లాడేందుకు మీరు అవకాశం ఇవ్వట్లేదు. నియమాలు రూపొం దించేది మీరే.. మీరే ఇలాచేస్తే ఎలా?’ అని ప్రశ్నించారు. అయినా విపక్షాలు తగ్గలేదు. ఈ సందర్భంలో కాంగ్రెస్‌పక్ష నేత మల్లికార్జున ఖర్గే స్పీకర్ వద్దకు వెళ్లి, ‘రాబర్ట్‌వాద్రా ఈ సభలో సభ్యుడు కాదని, ఆయన పేరును ఎలా ప్రస్తావిస్తార’ని ప్రశ్నించారు. ఈ సందర్భంలో సభ అదుపు తప్పడంతో స్పీకర్ సభను శుక్రవారానికి వాయిదావేశారు.
 
మన్మోహన్, ఆజాద్‌లతో మోదీ కరచాలనం
పార్లమెంటులో ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం రాజ్యసభలో పలువురు ప్రతిపక్ష నేతలను స్వయంగా కలసి పలకరించటం విశేషం. ప్రశ్నోత్తరాల సమయంలో ఎగువసభకు వచ్చిన మోదీ.. ప్రతిపక్ష స్థానం వైపు వెళ్లి మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ను పలకరించి, ఆయనతో కరచాలనం చేశారు. తర్వాత కొంచెం ముందుకెళ్లి ప్రతిపక్ష నేత గులాంనబీఆజాద్‌నూ పలకరించి, కరచాలనం చేశారు.

కాంగ్రెస్ సభాపక్ష ఉపనేత ఆనంద్‌శర్మకు ముకుళిత హస్తాలతో అభివాదం చేశారు. కాంగ్రెస్‌కే చెందిన కరణ్‌సింగ్‌తో కొద్ది క్షణాలు ముచ్చటించారు. జైరాంరమేశ్‌నూ పలకరించారు. వెనుదిరిగి వస్తూ సీపీఐ నేత డి.రాజాను పలకరించారు. ఆ తర్వాత తమ పార్టీ ఎంపీలను పలకరించిన మోదీ వారికి అభివాదం చేశారు.
 
సుష్మ దిగిపోతేనే చర్చ: రాహుల్
లలిత్ వివాదంపై మౌనం వహిస్తున్న ప్రధాని మోదీ విశ్వసనీయత దిగజారుతోందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఎదుర్కొంటున్న వివాదాలపై ప్రధాని నుంచి సమాధానాలు డిమాండ్ చేస్తున్న దేశ ప్రజల గొంతును మోదీ వినాలని వ్యాఖ్యానించారు. లలిత్‌గేట్ ఆరోపణలు ఎదుర్కొంటున్న విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్ ఆ పదవి నుంచి తప్పుకునే వరకూ.. ఆ అంశంపై పార్లమెంటులో చర్చకు తమ పార్టీ వ్యతిరేకమని ఆయన ఉద్ఘాటించారు.

రాహుల్ గురువారం ఢిల్లీలో పార్లమెంటు వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. ‘‘రాజీనామా లేనిదే చర్చ ఉండదని మేం చెప్పాం. సుష్మా నేరపూరిత చర్యకు పాల్పడ్డారు. ’’ అని రాహుల్ ఆరోపించారు. కాగా తమ  తమ వ్యూహానికి మద్దతుగా ఇతర ప్రతిపక్ష పార్టీలను కూడా కాంగ్రెస్ పార్టీ సమీకరిస్తోంది. రాహుల్, లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత ఖర్గేలు గురువారం ఎన్‌సీపీ నేత తారిఖ్ అన్వర్, జేఎంఎం నేత విజయ్ హాన్స్‌దక్, ఆమ్ ఆద్మీ పార్టీ నేత భగవత్‌మన్‌లను కలిసి చర్చించారు.
 
జైట్లీ అఖిలపక్ష భేటీకి కాంగ్రెస్ నై

పార్లమెంటులో ప్రతిష్టంభనను తొలగించేందుకు మార్గాన్వేషణలో భాగంగా రాజ్యసభ నాయకుడు, ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ గురువారం ఉదయం అఖిలపక్ష సమావేశం నిర్వహించటానికి పిలుపునిచ్చారు. అయితే.. ఈ భేటీకి హాజరయ్యేందుకు కాంగ్రెస్ నిరాకరించటంతో ఆ ప్రయత్నాన్ని జైట్లీ విరమించుకున్నారు. సమావేశంలో పరిష్కారం లభించదని, ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ నేతలను పదవుల నుంచి తొలగిస్తేనే పరిష్కారమవుతుందని రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాద్ పేర్కొన్నారు.

రాజీనామాల అంశంపై విపక్షాల మధ్య ఐక్యత లేదన్న వాదనలను ఆయన కొట్టివేశారు. ఎస్‌పీ, సీపీఐ, సీపీఎం, బీఎస్‌పీ, జేడీయూ పార్టీలన్నీ.. లలిత్‌మోదీ, వ్యాపమ్ కుంభకోణాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతల రాజీనామాలకు డిమాండ్ చేస్తున్నాయని చెప్పారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement