లోక్సభ వాయిదా
ఢిల్లీ: వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లో తొలిరోజు ఎలాంటి అధికారిక కార్యక్రమాలు చేపట్టకుండానే లోక్ సభ వాయిదా పడింది. మంగళవారం ఉదయం స్పీకర్ సుమిత్రా మహాజన్ అధ్యక్షతన ప్రారంభమైన లోక్సభలో కొన్ని తీర్మానాలను ఆమోదించారు. ముఖ్యంగా పీఎస్ఎల్వీ విజయవంతంపై ఇస్రో శాస్త్రవేత్తలకు, వింబుల్డన్ విజేతలకు పార్లమెంటు అభినందనలు తెలిపింది. సంతాపం తీర్మానం అనంతరం లోక్సభ రేపటికి వాయిదా పడింది. మరోవైపు రాజ్యసభలో లలిత్ మోదీ వ్యవహారంపై ప్రతిపక్షాలు ఆందోళనతో దుమారం చెలరేగింది. దీంతో స్పీకర్ కొద్దిసేపు సభను వాయిదా వేశారు.
అన్ని పార్టీలతో సోమవారం జరిగిన అఖిలపక్ష సమావేశం సామరస్యపూరక వాతావరణంలో జరిగిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాల్సిన బాధ్యత ప్రతిపక్షాలపై ఉందన్నారు. ఈ సమావేశాల్లో కొన్ని కీలకమైన నిర్ణయాలను తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. భారతదేశ అభివృద్ధి కోసం కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేందుకు తమ ప్రభుత్వం యోచిస్తోందని, దీనికి ప్రతిపక్షాలు సహకరించాలని ఆయన కోరారు.
మరోవైపు సభ్యులు లేవనెత్తె అన్ని అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో లోక్‌సభ స్పీకర్‌తో సుమిత్రా మహాజన్‌తో ప్రధాని, హోంమంత్రి, ఆర్థికమంత్రులు భేటీ అయ్యారు. సభ ప్రారంభానికి ముందు కేంద్రమంత్రి సుష్మస్వరాజ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీని మర్యాద పూరకంగా కలిశారు. వీరితో ప్రధాని కూడా జత కలిశారు.