దాడులను ఎందుకు అడ్డుకోలేకపోతున్నాం..
న్యూఢిల్లీ: అత్యంత కట్టుదిట్టమైన భద్రతల మధ్య ఉండే సైనిక స్థావరంపై ఉగ్రవాదులు దాడిచేయడం విస్మయానికి గురిచేస్తుంది. సైనిక స్థావరాలపై ఉగ్రవాదులు వరుసగా దాడులు జరుపుతున్నా.. వీటిని అడ్డుకోవడంలో ఎందుకు విఫలమౌతున్నాం అనే ప్రశ్న ఇప్పడు అందరిమదిలో మెదులుతోంది. పాకిస్తాన్ ఆర్మీ, ఐఎస్ఐ ఆధ్వర్యంలో సుశిక్షితులైన ఉగ్రవాదులకు.. స్థానికంగా ఉండే సానుభూతిపరుల సహకారం అందుతుండటం కూడా ఉగ్రదాడులకు సానుకూలంగా మారింది అనే వాదన వినిపిస్తోంది.
ఎల్ఓసీ ప్రాంతంలో ఉన్న పరిస్థితులు, నిఘాలోపాలు ఎప్పటికప్పుడు ఉగ్రవాదమూకలను పక్కాగా అందుతున్నాయి. ముఖ్యంగా సైనిక స్థావరాల్లో ఆర్మీ ట్రూప్లు మారుతున్న సమయంలో.. సెక్యూరిటీ సిబ్బంది ఏమరపాటును సైతం కనిపెట్టి ఉగ్రవాదులు దాడులు చేస్తున్నారని యూరీ ఘటన నిరూపిస్తోంది. భద్రతను పెంచడానికి గత కొన్నేళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నా.. ఎల్ఓసీతో పాటు సైనిక స్థావరాల్లో ఇప్పటికీ అత్యాధునిక ఫెన్సింగ్ సౌకర్యం లేదని ఓ సీనియర్ ఆర్మీ అధికారి తెలిపారు.