⇒ కశ్మీర్‌లో యూరి సైనిక స్థావరంపై పాక్ ఉగ్రవాదుల దాడి
⇒ 20 మంది జవాన్ల మృతి.. 20 మందికి గాయాలు
⇒ నలుగురు ముష్కరులనూ మట్టుబెట్టిన సైన్యం
⇒ వేకువజామున ఫెన్సింగ్ వైర్లు కత్తిరించి క్యాంపులోకి ప్రవేశించిన టైస్టులు
⇒ గ్రెనేడ్లు విసురుతూ, తుపాకులతో విచక్షణారహితంగా కాల్పులు
⇒ సైనిక గుడారాలకు అంటుకున్న మంటలు
⇒ మంటల్లోనే ఆహుతైన 13 మంది జవాన్లు
⇒ దాడి పాక్‌లోని జైషే ఉగ్రవాద సంస్థ పనే!
⇒ ఖండించిన రాష్ట్రపతి, ప్రధాని, సోనియా
⇒ హుటాహుటిన కశ్మీర్‌కు ఆర్మీ చీఫ్
⇒ భద్రతా దళాధికారులతో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ ఉన్నతస్థాయి సమీక్ష
యూరి/న్యూఢిల్లీ
ఆదివారం వేకువజాము 5.30 గంటలు.. కశ్మీర్‌లోని యూరి పట్టణం.. అప్పుడే తెలతెలవారుతోంది.. ఎలా వచ్చారో తెలియదు.. నలుగురు పాక్ ముష్కరులు.. పెద్ద ఎత్తున ఆయుధాలు.. పేలుడు పదార్థాలతో సైనిక స్థావరంపై విరుచుకుపడ్డారు.. టెంట్ల కింద నిద్ర పోతున్న జవాన్లపై విచక్షణరహితంగా కాల్పులకు తెగబడ్డారు.. బాంబులు విసిరారు.. కళ్లుమూసి తెరిచేలోపు 20 మందిని పొట్టనబెట్టుకున్నారు! వెంటనే తేరుకున్న సైనికులు నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు!! గత 25 ఏళ్లలో కశ్మీర్‌లో మన సైన్యంపై జరిగిన అతిపెద్ద దాడి ఇది.
ఈ ఘటనను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా, అమెరికా అధ్యక్షుడు ఒబామా సహా పలు దేశాల అధినేతలు తీవ్రంగా ఖండించారు. ఇది పిరికిపందల చర్య అని, దాడికి పాల్పడ్డవారిని వదిలే ప్రసక్తే లేదని ప్రధాని మోదీ పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ నేరుగా పాక్ పేరును ప్రస్తావిస్తూ నిప్పులు చెరిగారు. ఉగ్రవాదులకు సాయమందిస్తున్న పాక్‌ను ఏకాకిని చేయాలంటూ అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారు.
మంటలకు ఆహూతైనవారే ఎక్కువ..
ముష్కరులు దాడి జరిపిన యూరి సైనిక స్థావరం నియంత్రణరేఖకు కొద్ది కిలోమీటర్ల దూరంలోనే ఉంది. దీని సమీపంలోనే 12 బ్రిగేడ్ హెడ్‌క్వార్టర్స్ కూడా ఉన్నాయి. వేకువజాము కావడంతో కొందరు సైనికులు ఇంకా టెంట్ల కింద నిద్రిస్తున్నారు. ఇదే సమయంలో స్థావరం వెనుకభాగంలో ఫెన్సింగ్ వైర్లను కత్తిరించి క్యాంపులోకి ప్రవేశించారు. గ్రెనేడ్లు విసురుతూ, తుపాకులతో విచక్షణ రహితంగా కాలుస్తూ నలుగురు నాలుగు దిక్కులా వెళ్లారు. గ్రెనేడ్లు విసరడంతో టెంట్లకు నిప్పంటుకుంది. మంటలు సమీపంలోని బ్యారక్‌లకు కూడా వ్యాపించాయి.
ముష్కరుల కాల్పుల కంటే మంటల్లో చిక్కుకొనే ఎక్కువ మంది సైనికులు మరణించారు. చనిపోయిన 20 మంది జవాన్లు డోగ్రా రెజిమెంట్‌కు చెందినవారే. మరో 20 మంది సైనికులు గాయపడ్డారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను హెలికాప్టర్ ద్వారా 70 కి.మీ. దూరంలో ఉన్న శ్రీనగర్‌లోని ఆర్మీ ఆసుపత్రికి తరలించారు. మూడు గంటలపాటు ముష్కరులు-సైన్యం మధ్య హోరాహోరీ కాల్పులు జరిగాయి. బాంబుల మోత, కాల్పుల శబ్దంతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. ఉదయం 8.30 గంటలకల్లా నలుగురు ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. అనంతరం ఆ ప్రాంతమంతా జల్లడపట్టింది. పాక్‌లోని జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ ఈ ఘాతుకానికి పాల్పడినట్టు బలగాలు భావిస్తున్నాయి.
యూరికి హుటాహుటిన ఆర్మీ చీఫ్
దాడి సంగతి తెలియగానే ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్ సింగ్ సుహాగ్ హుటాహుటిన యూరికి వెళ్లారు. రక్షణమంత్రి మనోహర్ పారికర్ కూడా గోవా పర్యటనను రద్దు చేసుకొని శ్రీనగర్ వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ రష్యా, అమెరికా పర్యటనను రద్దు చేసుకొని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో కలిసి ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. డీజీఎంవో (డెరైక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్) లెఫ్టినెంట్ జనరల్ రణ్‌బీర్‌సింగ్ పాక్ డీజీఎంవోకు ఫోన్ చేశారు.
ఆయుధాలపై పాక్ గుర్తులు
ఉగ్రవాదులు హతమయ్యాక వారి నుంచి బలగాలు నాలుగు ఏకే 47 తుపాకులు, నాలుగు గ్రెనేడ్ లాంఛర్లు, పెద్దఎత్తున పేలుడు సామగ్రి స్వాధీనం చేసుకుయి. ఆ ఆయుధాలపై పాక్‌కు సంబంధించిన గుర్తులున్నాయి. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ డీజీఎంవో రణ్‌బీర్ సింగ్ పాక్ డీజీఎంవోను తీవ్ర స్వరంతో నిలదీశారు. ‘‘ఉగ్రవాదుల వద్ద దొరికిన ఆయుధాలపై పాక్ చిహ్నాలున్నాయి. ఇదే విషయాన్ని ఆ దేశ డీజీఎంవోకు చెప్పాను. ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరపడం, బాంబులు విసరడంతో టెంట్లకు నిప్పంటుకుంది. చనిపోయిన 17 మందిలో 13-14 మంది మంటల్లో చిక్కుకొని మృతి చెందారు’’ అని రణ్‌బీర్ సింగ్ ఢిల్లీలో వెల్లడించారు. మరో ముగ్గురు ఆస్పత్రిలో మరణించారు. యూరిలో ఇంకా కూంబింగ్ జరుపుతున్నట్లు వివరించారు. ఉగ్రవాదుల దాడి జరగొచ్చని నిఘా వ ర్గాలు ఇటీవలే హెచ్చరించాయని, అందుకు అనుగుణంగా అన్ని విభాగాలు చర్యలు తీసుకుంటున్నాయని పేర్కొన్నారు. కాగా, ముష్కరుల పోరులో వీరమరణం పొందిన సైనికులను చూసి గర్విస్తున్నామంటూ ఆర్మీ ఒక ప్రకటనలో పేర్కొంది.