
'దెబ్బకు దెబ్బే సమాధానం'
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్లోని యురి సెక్టార్లోగల ఆర్మీ బెటాలియన్ ప్రధాన కార్యాలయంపై ఉగ్రవాదుల దాడిపట్ల కేంద్ర హోంశాఖ మాజీ సెక్రటరీ ఆర్కే సింగ్ తీవ్రంగా ప్రతిఘటించారు. దీనికి దెబ్బకు దెబ్బే సమాధానం అని చెప్పారు. ఇది ఉగ్రవాదుల దాడిగానే భావిస్తే అంతరాత్మను మోసం చేసుకోవడమే అవుతుందని, ఈ దాడి వెను పాక్ ఆర్మీ, ఐఎస్ఐ హస్తం ఉందని ఆయన అన్నారు. పేరుకే ఉగ్రవాదుల దాడిలా కనిపిస్తుందని చెప్పారు.
ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా ఉండాలంటే ఇలాంటి దాడిని తలపించేలా తిప్పికొట్టడమే ప్రత్యామ్నాయం అని చెప్పారు. ఆదివారం వేకువజామున యురి సెక్టార్‌లో ఆర్మీ బెటాలియన్ ప్రధాన కార్యాలయంపై జవానులను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు దాడులు చేశారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య జరిగిన పోరాటంలో 17 మంది జవాన్లు వీర మరణం పొందగా, 20 మందికి గాయాలయ్యాయి. గాయపడిన జవాన్లను శ్రీనగర్‌లోని ఆర్మీ బేస్ ఆసుత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.