అవి చెత్త చట్టాలు : నరేంద్ర మోడీ
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : దేశంలో అనేక చట్టాలను రూపొందించారని, వాటిలో పనికి రాని చట్టాలను తొలగించాల్సి ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అభిప్రాయపడ్డారు. పరోక్షంగా గత యూపీఏ సర్కారును దెప్పి పొడిచారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం సాయంత్రం బెంగళూరుకు వచ్చిన ఆయన ఇక్కడి హెచ్‌ఏఎల్ విమానాశ్రయంలో ఏర్పాటు చేసి బీజేపీ కార్యకర్తల సభలో ప్రసంగించారు.
సుమారు పది వేల మంది కార్యకర్తలు పాల్గొన్న సభలో ప్రధాని ఉత్సాహంగా ప్రసంగించారు. కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటుకు ృషి చేశారని కార్యకర్తలను ప్రశంసిస్తూ ఆయన ప్రసంగాన్ని ప్రారంభించారు. సుమారు 30 ఏళ్ల తర్వాత ఒకే పార్టీ సొంత బలంతో కేంద్రంలో అధికారంలోకి రాగలిగిందని చెప్పారు. 1969లో ఇందిరా గాంధీ బ్యాంకులను జాతీయం చేశారని చెబుతూ, పేదల కోసం అలా చేశారని అప్పట్లో చెప్పుకునే వారని తెలిపారు.
అయితే ఇప్పటికీ బ్యాంకుల వల్ల పేదలకు ఎలాంటి ప్రయోజనాలు చేకూరలేదని విమర్శించారు. దీని కోసమే ‘ప్రధాన మంత్రి జన ధన్’ కార్యక్రమాన్ని ప్రారంభించామని గుర్తు చేశారు. ఈ పథకం కింద పైసా లేకున్నా బ్యాంకు ఖాతాను ప్రారంభించవచ్చని తెలిపారు. దీని వల్ల ఇప్పటికే సుమారు నాలుగు కోట్ల మంది ఖాతాలను తెరిచారని, తద్వారా బ్యాంకుల్లో రూ.1,500 కోట్లు జమ అయ్యిందని వెల్లడించారు. ఇకమీదట పేదలు డబ్బు కోసం ధనవంతుల వద్దకు వెళ్లాల్సిన పని లేదని, వడ్డీలు, చక్రవడ్డీలు చెల్లించాల్సిన పని లేదని చెప్పారు. బ్యాంకులు, అందులోని డబ్బు ధనికుల కోసం కాదని అన్నారు.
2 నుంచి స్వచ్ఛతా అభియాన్
దేశ వ్యాప్తంగా వచ్చే నెల రెండో తేదీ నుంచి స్వచ్ఛతా అభియాన్‌ను ప్రారంభించనున్నట్లు ప్రధాని తెలిపారు. విదేశాల్లో లాగా మన పరిసరాలను మనమే శుభ్రం చేసుకోవాలని సూచించారు. కొత్త ఇళ్లకు వెళితే ఎలా శుభ్రం చేసుకుంటామో, ఆ విధంగా ప్రజలందరూ ఈ స్వచ్ఛతా కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు.
ఏడాదిలో వంద గంటలు పరిశుభ్రత కోసం కేటాయించాలని ఆయన పిలుపునిచ్చారు. పరిశుభ్రత విషయంలో మనం ఒక అడుగు ముందుకేస్తే ప్రపంచ దేశాల ముందు తల ఎత్తుకుని తిరగవచ్చని అన్నారు. సాధారణ ప్రజలకు ఇవంతా చిన్న పనులేనని అంటూ, ఈ చిన్న పనులను సాధించడం ద్వారానే వారు దేశాన్ని అత్యున్నత శిఖరాలకు తీసుకెళ్లవచ్చని ఉద్బోధించారు. రైతులు ఈ దేశంలోని ధాన్యాగారాలను నింపాలని అంటూ, వారు గౌరవప్రదంగా బతకడానికి వారి జేబులను కూడా నింపాల్సి ఉందని తెలిపారు. యువకులు తమ డిగ్రీలతోనే ఉద్యోగాలు తెచ్చుకోలేరని, నైపుణ్యాన్ని సాధించాల్సి ఉందని సూచించారు. దీనిని ృష్టిలో ఉంచుకునే నైపుణ్యాభిృద్ధికి ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశామని ఆయన వెల్లడించారు.
ఘన స్వాగతం
సాయంత్రం 5.45 గంటలకు హెచ్‌ఏఎల్ విమానాశ్రయంలో దిగిన ప్రధానికి ఘన స్వాగతం లభించింది. గవర్నర్ వజూభాయ్ వాలా, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేంద్ర మంత్రులు సదానంద గౌడ, అనంత కుమార్, సిద్ధేశ్వర్, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ప్రహ్లాద జోషి, జాతీయ ఉపాధ్యక్షుడు యడ్యూరప్ప, మాజీ ఉప ముఖ్యమంత్రులు ఈశ్వరప్ప, అశోక్ ప్రృతులు ప్రధానికి స్వాగతం పలికారు. కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించిన అనంతరం ప్రధాని రాజ్ భవన్‌లో బస చేశారు.