
లక్నో: దేశ ప్రజానీకమంతా లాక్‌డౌన్ నేపథ్యంలో కుటుంబాలతో గడుపుతుండగా.. పోలీసు, వైద్య సిబ్బంది మాత్రం కరోనా పోరులో ముందుండి, ప్రాణాలను రిస్కులో పెట్టి సేవలందిస్తున్నారు. 35 డిగ్రీల ఎండ వేడిలో మొబైల్ చూసుకుంటున్న ఈయన రమాకాంత్ నాగర్ (25). కోవిడ్ వారియర్స్‌లో ఒకరైన పోలీసు. కూతూరు జన్మించి 12 రోజులవుతున్నా ఇంటిముఖం చూడకుండా విధుల్లో తలమునకలయ్యారు. నవజాత శిశువు ఫొటోల్ని కుటుంబ సభ్యులు వాట్సాప్‌లో పంపించడంతో చూసి మురిసిపోతున్నారు. కూతురును చూసేందుకు వెళ్దామని ఉన్నా.. లాక్‌డౌన్ పూర్తయితేగాని ఇంటికి వెళ్లనని చెప్తున్నారు. తన సహోద్యోగులంతా డ్యూటీ చేస్తుండగా.. తాను మాత్రం ఎలా వెళ్లగలనని అంటున్నారు. ఇటావా ప్రాంతంలో డ్యూటీ చేస్తున్న రమాకాంత్ ఫొటోపై కొందరు నెటిజన్లు ‘ప్రజా సేవకు అంకితమైన ఓ పోలీసు.. మీకు సలాం’ అని కామెంట్లు చేస్తున్నారు.
(చదవండి: మహమ్మారి నెమ్మదించాలంటే..)
ఇక దేశవ్యాప్తంగా మే 3 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేటి ఉదయం ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా, జనాభా పరంగా పెద్దదైన ఉత్తర ప్రదేశ్ లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తుండటంతో ఇప్పటివరకు 657 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 49 మంది కోలుకున్నారు. 5 మంది మరణించారు. రాష్ట్ర వ్యాప్తంగా 150 కంటైన్‌మెంట్లు ఉండగా.. ఒక్క కేసు మాత్రమే ఉన్న ఇటావా ఆ జాబితాలో లేదు. మంగళవారం సాయంత్రం నాటికి కేంద్ర ఆరోగ్యశాఖ వివరాల ప్రకారం.. దేశవ్యాప్తంగా కోవిడ్ కేసుల సంఖ్య 10,815 కు చేరగా.. 1189 మంది కోలుకున్నారు. 353 మరణాలు సంభవించాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 9272గా ఉంది.
(చదవండి: లాక్‌డౌన్ పొడిగింపుకు అసలు కారణం ఇదేనా..!)
Comments
Please login to add a commentAdd a comment