పోలీసులు మాత్రం చిన్నపాటి ఘర్షణకే మూడో తరగతి బాలుడిపై 107/116 సెక్షన్ల కింద శాంతిభద్రతల ఉల్లంఘన కేసు నమోదు చేశారు.
ఆగ్రా: ఉత్తరప్రదేశ్లో అత్యచారాలు, మతఘర్షణలను కట్టడి చేయలేక విమర్శలు ఎదుర్కొంటుండగా.. పోలీసులు మాత్రం చిన్నపాటి ఘర్షణకే మూడో తరగతి బాలుడిపై 107/116 సెక్షన్ల కింద శాంతిభద్రతల ఉల్లంఘన కేసు నమోదు చేశారు. తొమ్మిదేళ్ల బాలుడితో పాటు తండ్రిని అరెస్ట్ చేశారు. తండ్రీకొడుకులు కోర్టు వెళ్లి బెయిల్ తీసుకున్నారు. ఫిరోజాబాద్ జిల్లా తుండ్లా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది.
ఈ కేసుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. కుర్రా అనే గ్రామంలో బాలుడికి చెందిన పశువులు ఇతరుల పొలంలోకి వెళ్లి పంటను ధ్వంసం చేశాయి. ఈ విషయంపై ఆ బాలుడు మరో అబ్బాయి గొడవపడ్డారు. ఇరు కుటుంబాలు వాదులాడుకున్నాయి. అంతే పోలీసులు వచ్చి తండ్రీకొడుకులను స్టేషన్కు తీసుకెళ్లారు. పోలీసులు కనీసం తమ వాదన కూడా వినలేదని బాధితుల బంధువు ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు.
మైనర్ బాలుడిపై తీవ్రమైన శాంతిభద్రతల ఉల్లంఘన కేసు నమోదు చేయడం వివాదాస్పదమైంది. తుండ్లా పోలీస్ ఇన్స్పెక్టర్ ఈ కేసుపై స్పందిస్తూ.. బాలుడిని బంధించలేదని, విచారణ కోసం తండ్రితో కలసి స్టేషన్లో కాసేపు కూర్చోబెట్టామని వివరణ ఇచ్చారు. అయినా మైనర్పై కఠిన సెక్షన్లు నమోదు చేయడం తప్పని అంగీకరించారు. ఈ సంఘటనపై విచారణ చేస్తున్నామని, దర్యాప్తు చేయకుండా బాలుడిపై కేసు నమోదు చేసిన ఎస్ఐపై చర్యలు తీసుకుంటామని సీఐ చెప్పారు.