ఎస్ఐని లాగి చెంపమీద కొట్టాడు!
తన పేరు చెప్పేటప్పుడు ఆ యువకుడి గొంతులో కాస్తంత గర్వం తొణికిసలాడింది. ''నా పేరు మోహిత్ యాదవ్..'' అంటూనే ఒక్కసారిగా అక్కడున్న పోలీసు అధికారి చెంప మీద కొట్టాడు. తన మేనమామ పేరు చెప్పుకొంటూ అతగాడు రెచ్చిపోయాడు. ఎందుకంటే అతడి మేనమామ ఉత్తరప్రదేశ్‌లోని ఇటా నియోజకవర్గానికి చెందిన సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్సీ!! మోహిత్ యాదవ్ అప్పటికే బాగా తాగేసి ఉన్నాడు. తనను స్టేషన్‌కు పిలిపించినందుకు అతడికి ఎక్కడలేని కోపం వచ్చింది. దాంతో ఎస్ఐ జితేంద్ర కుమార్‌ను లాగి ఒక్కటిచ్చాడు. అక్కడున్న మిగిలిన పోలీసులు అతడిని పట్టుకుని ఆపేందుకు ప్రయత్నించగా, వాళ్లలో ఒకరి కాలర్ పట్టుకున్నాడు. పోలీసు అధికారుల విధి నిర్వహణను అడ్డుకున్నందుకు యాదవ్‌ను అరెస్టు చేశారు.
మోహిత్ యాదవ్ మామ రమేష్ యాదవ్ సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నాయకుడు, ప్రస్తుతం ఎమ్మెల్సీ. యూపీ ఎన్నికల సమయంలో ఆయనను బీజేపీ తమ పార్టీ నుంచి తప్పించింది. అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో ఇలాంటి ఘటనలు చాలావరకు జరిగాయి. రాజకీయ నాయకులు, వాళ్ల బంధువులు పలువురు అధికారుల మీద దాడులు చేసేవారు. అయితే కొత్తగా అధికారం చేపట్టిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాత్రం ఇలా ఎవరైనా చట్టాలను ఉల్లంఘిస్తే ఊరుకునేది లేదని స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు.
మోహిత్ యాదవ్ నిరుద్యోగి. వాళ్ల నాన్నకు తుపాకుల దుకాణం ఉంది. మోహిత్ పొద్దున్న ఆస్పత్రికి వెళ్లి, తన బంధువుకు ఎక్స్‌రే తీయించుకోడానికి వీఐపీ ట్రీట్‌మెంట్ కావాలని డిమాండ్ చేశాడు. వాళ్లను వెంటనే చూడాలని, క్యూలో వేచి ఉండేది లేదని అన్నాడు. అలా కుదరదని అక్కడి సిబ్బంది చెప్పడంతో అక్కడున్న ల్యాబ్ టెక్నీషియన్‌ను కొట్టడంతో పాటు డాక్టర్ మీద కూడా దాడి చేశాడు. ఆస్పత్రి వర్గాలు పోలీసులకు చెప్పడంతో వాళ్లొచ్చి అతడిని స్టేషన్‌కు లాక్కెళ్లారు. అక్కడ కూడా అలాగే చేయడంతో లోపల వేశారు. అతడు బాగా తాగినట్లు తెలుస్తోందని సీనియర్ పోలీసు అధికారి సత్యార్థ్ అనిరుథ్ పంకజ్ చెప్పారు.