'డబ్బు కాదు.. ప్రజాసేవ సంగతి చూడండి'
రాజకీయ నాయకుల్లో పెరిగిపోతున్న అవినీతి వాళ్లకే చిరాకు తెప్పిస్తోంది. మరో రెండేళ్లలో ఉత్తరప్రదేశ్లో ఎన్నికలు ఉండటంతో సమాజ్వాదీ పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ తన పార్టీ నాయకుల మీద మండిపడ్డారు. డబ్బు సంపాదన మీద దృష్టిపెట్టడం కాదని, ప్రజాసేవ సంగతి చూడాలని కాస్తంత గట్టిగానే చెప్పారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అక్రమ మైనింగ్ పెరిగిపోతోందని, దీనిపై కఠినంగా వ్యవహరించాలని కలెక్టర్లను కోరారు.
తమ పార్టీ వాళ్లయినా సరే అక్రమ మైనింగులో ఉంటే జైలుకు పంపాలని తెలిపారు. రాజకీయాల్లో ఉన్నవాళ్లు ప్రజాసేవ చేయడం మానేసి వ్యాపారాలు చేసుకుంటున్నారని, ఇది హద్దులు కూడా దాటుతోందని, తన కుటుంబంలో ఎవరైనా కాంట్రాక్టులు తీసుకుంటున్నట్లు తెలిస్తే వెంటనే తనకు చెప్పాలని ఆయన అన్నారు. మనది పేదల పార్టీ అని, సిద్దాంతాలకు కట్టుబడి ఉంటుందని అంతే తప్ప కేవలం డబ్బు సంపాదన మీద దృష్టి పెట్టేవాళ్ల కోసం కాదని ములాయం చెప్పారు. ఈ సమావేశానికి తన కొడుకు, యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ను కూడా రమ్మని పిలిచాను గానీ.. తాను రానని చెప్పాడన్నారు.