ఎన్నికల గుర్తుకోసం ఎందుకంత పోరాటం? | why Mulayam and Akhilesh fighting for party and symbol | Sakshi
Sakshi News home page

ఎన్నికల గుర్తుకోసం ఎందుకంత పోరాటం?

Published Tue, Jan 3 2017 4:13 PM | Last Updated on Fri, Mar 22 2019 6:16 PM

why Mulayam and Akhilesh fighting for party and symbol

సాక్షి, న్యూఢిల్లీ: సమాజ్‌వాది పార్టీని రెండుగా చీల్చిన తండ్రీ తనయులు ములాయం సింగ్‌ యాదవ్, అఖిలేష్‌ యాదవ్‌లు ఇప్పుడు ఎన్నికల కమిషన్‌ వద్ద పార్టీ గుర్తయిన ‘సైకిల్‌’ను సొంతం చేసుకునేందుకు పోటీ పడుతున్నారు. గుర్తునుచూసి ఓటేసే నిరక్షరాస్యులున్న భారత్‌ లాంటి దేశంలో గుర్తుకు ఎంతో ప్రాధాన్యత ఉన్న విషయం తెల్సిందే.

దక్షిణ భారత దేశంలో పార్టీలు చీలిపోవడం, గుర్తు కోసం గొడవ పడడం, ఎన్నికల కమిషన్‌ వద్దకు వెళ్లడం, కోర్టులను ఆశ్రయించడం సాధారణమే. మామకు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు తెలుగుదేశం గుర్తు ‘సైకిల్‌’ను దక్కించుకోవడం కోసం హైకోర్టు ఆశ్రయించాల్సి వచ్చింది. 1987లో ఎంజీఆర్‌ మరణించడంతో ఏఐడీఎంకే రెండు వర్గాలుగా చీలిపోవడంతో ఎంజీఆర్‌ భార్య జానకీ రామచంద్రన్, జయలలిత వర్గాలు రెండాకుల గుర్తు కోసం పోటీ పడ్డాయి. కరుణానిధి నాయకత్వంలోని డీఎంకె నుంచి వై. గోపాలస్వామి (వైకో)ని బహిష్కరించినప్పుడు ఆయన పార్టీని చీల్చి ఉదయిస్తున్న సూర్యుడి గుర్తును దక్కించుకునేందుకు ప్రయత్నించారు.

ఎన్టీఆర్‌ను పడదోసినప్పుడు..
1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్టీరామారావు నాయకత్వాన తెలుగుదేశం పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చింది. ఎన్టీ రామారావు మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు నాయుడు నాయకత్వాన పార్టీలో అసమ్మతి రాజకీయాలు మొదలయ్యాయి. 1995లో జరిగిన కోపరేటివ్‌ ఎన్నికల్లో కొన్ని కోపరేటివ్‌ స్థానాలను తెలుగుదేశం కోల్పోయింది. దానికి చంద్రబాబు మద్దతుదారులే కారణమని భావించిన ఎన్టీఆర్‌ పార్టీ నుంచి ఎనిమిది ఎమ్మెల్యేలను బహిష్కరించారు. వారి బహిష్కరణను తక్షణమే ఎత్తివేయాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు. అందుకు ఎన్టీఆర్‌ అంగీకరించలేదు.


వైస్రాయ్‌ హోటల్‌ కేంద్రంగా..
చంద్రబాబు పార్టీలో అసమ్మతి రాజకీయాలను తీవ్రతరం చేశారు. దీంతో ఎన్టీఆర్‌ 1995, ఆగస్టు 25వ తేదీన కేబినెట్‌ సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వాన్ని రద్దుచేసి కొత్తగా ఎన్నికలకు వెళ్లాలని తీర్మానం చేశారు. ఆ తీర్మానాన్ని అప్పటి రాష్ట్ర గవర్నర్‌ కష్ణకాంత్‌కు పంపించారు. అయితే ఆయన సకాలంలో స్పందించలేదు. ఇంతలో చంద్రబాబు తన మద్దతుదారులతో, తోటి కుటుంబ సభ్యులతో వైస్రాయ్‌ హోటల్‌లో మకాం వేసి మెజారిటీ ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకున్నారు. మెజారిటీ ఎమ్మెల్యేలు తనను నాయకుడిగా ఎన్నికున్నారని, అసెంబ్లీని రద్దు చేయకూడదంటూ పోటీ తీర్మానం ద్వారా గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు నాయుడు హైకోర్టును ఆశ్రయించి తమదే అసలైన తెలుగుదేశం పార్టీ అని, ఎన్నికల గుర్తు సైకిల్‌ తనకే దక్కాలంటూ న్యాయపోరాటం జరిపి దక్కించుకున్నారు.

రెండాకుల గుర్తుకోసం గొడవ..
1987లో ఎంజీ రామచంద్రన్‌ చనిపోయినప్పుడు ఆయన భార్య జానకి రామచంద్రన్, సన్నిహితురాలు జయలలిత మధ్య పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. జయలలిత మద్దతుదారులైన 33 మంది శాసన సభ్యులను జానకి రామచంద్రన్‌ బహిష్కరించడంతో ఆమె ప్రభుత్వం పడిపోయింది. పార్టీపై పట్టుకోసం ఇరువర్గాలు తమ పోరాటాన్ని సాగించాయి. 1989లో ఎన్నికల కోసం పార్టీ ఎన్నికల గుర్తు ‘రెండాకులు’తమకే కేటాయించాలంటూ ఇరువర్గాలు ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించాయి. ఎన్నికల కమిషన్‌ ఎవరికి ఆ గుర్తును కేటాయించ కుండా కొత్త గుర్తులు ఇచ్చింది. జానకి వర్గానికి జంట పావురాలు, జయలలిత వర్గానికి కోడిపుంజు గుర్తులు లభించాయి. ఎన్నికల్లో తన వర్గం తీవ్రంగా దెబ్బతినడంతో జానకి రామచంద్రన్‌ రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకున్నారు. ఆ తర్వాత జయలలిత నాయకత్వాన రెండు వర్గాలు కలసిపోయాయి.


డీఎంకేలో కూడా ముసలం..
డీఎంకే నాయకుడు కరుణానిధి తన వారసుడిగా తన కుమారుడు స్టాలిన్‌ను ప్రోత్సహిస్తుండడంతో పార్టీ సీనియర్‌ నాయకుడు వై. గోపాలస్వామీ పార్టీలో ముసలం పుట్టించారు. పార్టీని చీల్చేందుకు ప్రయత్నించారు. ఎల్టీటీఈ సహకారంతో కరుణానిధిని చంపేందుకు కుట్రపన్నారన్న ఆరోపణలపై వైకోను 1993లో పార్టీ నుంచి బహిష్కరించారు. తొమ్మిది జిల్లా పార్టీ కార్యదర్శులు ఆయన వెంట వెళ్లారు. వైగో తన మద్దతుదారులతో ఎన్నికల కమిషన్‌ వద్దకు వెళ్లి పార్టీని, పార్టీ గుర్తును దక్కించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ విషయం తెలిసి కరుణానిధి అత్యవసరంగా పార్టీ సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కరాణానిధి నాయకత్వం పట్లనే విశ్వాసం వ్యక్తం చేస్తూ సర్వ సభ్య సమావేశం తీర్మానం చేసింది. పార్టీ కార్యవర్గ కమిటీ, వివిధ కమిటీల నుంచే కాకుండా శాసన సభ్యులు, పార్టీ పార్లమెంటరీ బోర్డు నుంచి కూడా ఇలాంటి తీర్మానాలు చేయించారు.

ఇప్పుడు అలాంటి తీర్మానాలే అవసరం..
కరుణానిధి నాయకత్వం పట్ల విశ్వాసం వ్యక్తం చేస్తూ పార్టీకి చెందిన వివిధ వేదికల వద్ద తీర్మానాలు చేయడం వల్ల పార్టీ పేరు, ఎన్నికల గుర్తు ఆయనేదంటూ అప్పటి ప్రధాన ఎన్నికల కమిషనర్‌ ఎన్‌. గోపాల స్వామి నిర్ణయించారు. ఇప్పుడు సమాజ్‌వాది పార్టీలో కూడా ఇలాంటి సమస్యే ఏర్పడినందున అటు ములాయం సింగ్‌ యాదవ్‌గానీ ఇటు అఖిలేష్‌ యాదవ్‌ గానీ పార్టీకి చెందిన అని శాఖల వద్ద విశ్వాస తీర్మానం పొందడం మంచిది. ఇలాంటి తీర్మానాలు చేయించడం, వాటిని భద్రపర్చడం ములాయం సింగ్‌కు మొదటి నుంచే అలవాటే. మరి అఖిలేష్‌ యాదవ్‌కు అలాంటి ముందు జాగ్రత్త ఉందా అన్నది సందేహం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement