’సైకిల్’ ఎవరిదో తేల్చుకోండి?
- గుర్తు ఎవరిదో 9లోగా తెలుపాలి
- అఖిలేశ్, ములాయం గ్రూపులకు ఈసీ ఆదేశం
- తన వర్గం ఎమ్మెల్యేలతో అఖిలేశ్ భేటీ
- సయోధ్యకు నై అంటున్న ములాయం.. ఢిల్లీకి పయనం
సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) గుర్తు సైకిల్ కోసం హోరాహోరీగా తలపడుతున్న అఖిలేశ్ యాదవ్, ములాయంసింగ్ యాదవ్ గ్రూపులకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) తాజాగా ఆదేశాలు జారీచేసింది. పార్టీని, ఎన్నికల గుర్తుని కోరుకుంటున్న ఈ రెండు గ్రూపులు ఈ నెల తొమ్మిదో తేదీలోగా పిటిషన్లను తమకు దాఖలు చేయాలని ఈసీ ఆదేశించింది. మరోవైపు ఎస్పీలో తలెత్తిన యాదవ్ కుటుంబ ఆధిపత్య పోరాటం కొనసాగుతూనే ఉంది. పార్టీ ఎవరి అధీనంలో ఉండాలి? ఎవరి నాయకత్వంలో ఎన్నికల్లో పోటీ చేయాలి? అన్నదానిపై అబ్బాయి అఖిలేశ్, బాబాయి శివ్‌పాల్ యాదవ్ వర్గాల మధ్య తలెత్తిన సంక్షోభం.. చీలిక దారితీసిన సంగతి తెలిసిందే. మెజారిటీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, నేతలతో పార్టీని నిలువునా చీల్చిన అఖిలేశ్ ఎస్పీ జాతీయ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో తన మద్దతుదారులైన ఎమ్మెల్యేలతో ఆయన గురువారం లక్నోలో సమావేశం నిర్వహించారు. మరోవైపు తమ్ముడు శివ్‌పాల్ యాదవ్‌కు అండగా ఉన్న ములాయం కూడా వెనుకకు తగ్గడం లేదు. కొడుకు అఖిలేశ్ సయోధ్యకు ఆయన ఏమాత్రం సుముఖంగా లేనట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ములాయం, శివ్‌పాల్‌తో కలిసి హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరారు. ఈ నేపథ్యంలో రెండు వర్గాలు వేర్వేరుగా పోటీచేస్తాయా? లేక సయోధ్యకు తెరవెనుక ప్రయత్నాలు ఏమైనా జరగుతున్నాయా? అన్నది వేచి చూడాలి.