
మోదీ ఎఫెక్ట్: రాజె లండన్ టూర్ రద్దు
జైపూర్: ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీ వివాదం రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజెను వెంటాడుతోంది. రాజె లండన్ పర్యటనను రద్దు చేసుకున్నారు. మోదీ వ్యవహారంలో రాజెపై విమర్శలు రావడమే దీనికి కారణమని భావిస్తున్నారు.
షెడ్యూల్ ప్రకారం ఈ నెల 27న రాజె బ్రిటన్ పర్యటనకు వెళ్లాల్సివుంది. లండన్లో వ్యాపారవేత్తలతో సమావేశం కావాల్సివుంది. కాగా ఈ నెల 28న ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ కార్యక్రమంలో పాల్గొనాల్సివున్నందున వసుంధర బ్రిటన్ పర్యటనను రద్దు చేసుకున్నారని సీఎంఓ ప్రతినిధి ఒకరు చెప్పారు. మోదీకి వీసా మంజూరు విషయంలో రాజెతో పాటు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ సాయం చేయడం వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఆర్థిక అవకతవకలకు పాల్పడిన మోదీ విచారణకు సహకరించకుండా లండన్లో తలదాచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రాజె లండన్ పర్యటన రద్దు కావడం చర్చనీయాంశంగా మారింది.