వెజిట్రబుల్స్
ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టులేదు.. అనే పాట పాడుకోవడానికి అసలైన సందర్భం ఇదేనేమో..! ఎందుకంటే చినుకు పడక, మొక్క మొలకెత్తక కూరగాయల దిగుబడి గణనీయంగా తగ్గింది. మార్కెట్‌కు రావాల్సినంత సరుకు రాకపోవడంతో ఉన్న సరుకు ధర అమాంతంగా పెరిగిపోతోంది. దీంతో కిలో కొందామని మార్కెట్‌కు వచ్చి పావుకిలోతో ‘ఆయన’ ఇంటికి వెళ్తుండగా... కొసరు సరుకుతో వంట చేయాల్సిన పరిస్థితి ‘ఆమె’ది. ఇప్పుడే చుక్కలనంటు తున్న కూరగాయల ధరలు మరికొన్ని రోజులపాటు వర్షాలు కురవకపోతే ఎలా ఉంటాయో ఊహించుకుంటేనే భయమేసే దుస్థితి నెలకొంది.
సాక్షి, ముంబై: వర్షాలు ముఖం చాటేయడంతో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. కూరగాయల దిగుబడి తగ్గిపోవడంతో నవీముంబై, వాషిలోని వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీ (ఏపీఎంసీ)కి ప్రతీరోజు వందలాదిగా రావాల్సిన కూరగాయల ట్రక్కులు పదుల సంఖ్యలో వస్తున్నాయి. ఫలితంగా నిల్వలు తగ్గిపోయి సరుకు కొరత తీవ్రమవుతోంది. దీని ప్రభావం సరుకు ధరలపై పడుతోంది. ఈ సంవత్సరం వర్షాలు ఆలస్యం కావడంతో కూరగాయలు సాగు చేయాల్సిన రైతులు చేతులు ముడుచుకొని కూర్చుంటున్నారు. మరికొన్ని రోజులు ఇలాగే కొనసాగితే ఇక సాగు చేసినా సరైన దిగుబడి రాని పరిస్థితి నెలకొంటుందంటున్నారు. గత నెలతో పోలిస్తే ఈ నెలలో కూరగాయల ధరలు 15-20 శాతం పెరిగిపోయాయి. ప్రతీ సంవత్సరం వేసవి కాలంలో దిగుబడి తగ్గిపోయి ధరలు పెరుగుతాయి. అయితే జూన్ మొదటి వారంలో వర్షాలు కురవడంతో ధరలు తగ్గుముఖం పడతాయి.
కాని ఈ ఏడాది వేసవిలో పెరిగిన ధరల జోరు జూన్ పూర్తయినా కూడా కొనసాగుతోంది. వర్షాలు పత్తా లేకపోవడంతోనే వేసవిలోకంటే కూడా కూరగాయల ధరలు ఎక్కువగా ఉంటున్నాయని చెబుతున్నారు. గత నెలలో ఏపీఎంసీలోకి ప్రతీరోజు 550 పైగా ట్రక్కులు కూరగాయల లోడ్లతో వచ్చాయి. అయితే జూన్ నెల మొదటి వారంలో ఏరోజూ ట్రక్కుల సంఖ్య 500 దాటలేదు. రెండోవారం వచ్చేసరికి మరింతగా తగ్గింది. నెలాఖరునాటికి పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ట్రక్కులు ఎప్పుడు వస్తాయా? అని ఎదురుచూసే పరిస్థితి నెలకొంది. ఒకవేళ మరో వారంరోజుల్లో వర్షాలు కురవకపోతే కూరగాయల ధరలు మరింత మండిపోతాయని ఏపీఎంసీ కి చెందిన ఓ హోల్‌సేల్ వ్యాపారి తెలిపారు. ఇదిలావుండగా కూరగాయల ధరలు పెరిగినప్పటికీ టమాటాలు మాత్రం కొంత ఊరటనిస్తున్నాయి. ప్రస్తుతం టమాటలు ఏపీఎంసీలో హోల్‌సెల్‌గా 10 కేజీలకు రూ.140 చొప్పున ధర పలుకుతున్నాయి. కొనుగోలుదారుల చెంతకు వచ్చే సరికి అవి కేజీకీ రూ.20 చొప్పున లభిస్తున్నాయి. మిగతా కూరగయాలతో పోలిస్తే వీటి ధర తక్కువగానే ఉందని చెబుతున్నారు.
ఏపీఎంసీలో ప్రస్తుతం హోల్‌సెల్‌లోలభిస్తున్న కూరగాయలు.
పెరిగిన కూరగాయల ధరల వివరాలు (10 కేజీలకు)
కూరగాయ గతనెలలో ప్రస్తుతం
క్యాలీప్లవర్ రూ.140 రూ.200
క్యాబేజీ రూ.100 రూ.140
వంకాయలు రూ.200 రూ.300
పచ్చిబఠానీ రూ.250 రూ.340
సొరకాయ రూ.100 రూ.200