ఈసారి మోతే!
జిల్లాలో భారీగా తగ్గిన కూరగాయల సాగు విస్తీర్ణం
వర్షాభావ పరిస్థితులతో ఎండిపోతున్న తోటలు
తీవ్ర నష్టాల్లోకి కూరుకుపోతున్న అన్నదాతలు
ఈఏడాది నగరానికి సరఫరా అంతంత మాత్రమే
జిల్లాలో కూరగాయల సాధారణ సాగు 25,000 హెక్టార్లు
ఈ ఏడాది సాగు చేసిన మొత్తం 4,600 హెక్టార్లు
ఇప్పటికే మార్కెట్‌లో కూరగాయల ధరలు ఆకాశంలో ఉన్నాయి. ఈ ఏడాది జిల్లాలో సాగు విస్తీర్ణం మరింత తగ్గడంతో అవి మరికాస్త పైకి పోనున్నాయి. సమీప రోజుల్లో ఇప్పటి రేట్లకు ధరలు రెట్టింపు అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. హైదరాబాద్ మహానగరానికి అధికంగా కూరగాయలను సరఫరా చేస్తున్నది జిల్లా రైతులే. జిల్లా హైదరాబాద్‌కు చుట్టుకొని ఉండడంతో స్థానిక రైతులు మొదటి నుంచీ కూరగాయలను అధికంగా పండించి నగర అవసరాలను తీరుస్తున్నారు. అయితే ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా రైతులు సాగుకు మొగ్గుచూపలేదు. వేసిన కొద్దిపాటి పంటలు కూడా ఎండుముఖం పట్టాయి.
- చేవెళ్ల రూరల్
చేవెళ్ల రూరల్ : పెరిగిన కూరగాయల ధరలతో సతమతం అవుతున్న ప్రజలు రానున్న రోజుల్లో మరింత భారం మోయక తప్పని పరిస్థితి. ఎందుకంటే యేటా జిల్లాకు కావాల్సిన కూరగాయలను సరఫరా చేస్తూ, నగరానికి కూడా అందిస్తున్న రైతులు ఈ సారి చేతులెత్తేశారు. తీవ్ర వర్షాభావమే ఇందుకు ప్రధాన కారణం.
జిల్లా నగరానికి ఆనుకుని ఉండడంతో రైతులు కూరగాయల సాగుపైనే అధికంగా ఆధారపడ్డారు. అయితే గత మూడేళ్లుగా వాతావరణం అనుకూలించకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ కారణంతో కొందరు కూరగాయల సాగుకు దూరమైతే.. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా భూగర్భజలాలు అడుగంటి మరి కొందరు సాగు చేపట్టలేదు. మరోవైపు ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడం, పెరిగిన పెట్టుబడులు, రియల్ వ్యాపారంలో భూములను అమ్ముకోవడం.. తదితర కారణాల వల్ల జిల్లాలో కూరగాయల సాగు గణనీయంగా తగ్గుతూ వస్తోంది. ఈ ఏడాది జిల్లాను కూరగాయల జోన్‌గా అభివృద్ధి చేస్తామన్న సీఎం మాటలు.. మాటలకే పరిమితం అయ్యాయి. జిల్లాలో కూరగాయల సాధారణ సాగు 25 వేల హెక్టార్లు. ఈ ఏడాది ప్రస్తుతం ఇప్పటివరకు 4,600 హెక్టార్లలో మాత్రమే సాగు చేపట్టినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఇప్పటికి సరైన వర్షాలు కూడా లేకపోవడంతో కూరగాయల సాగు పెరిగే అవకాశం కూడా చాలా తక్కువ. ముఖ్యంగా అధిక కూరగాయలసాగు చేపట్టే పశ్చిమ రంగారెడ్డి జిల్లా రైతులు ఈ సారి అందుకు దూరంగా ఉన్నారు.
ప్రభుత్వ ప్రోత్సాహమేదీ..?
ఈ ఏడాదికి సబ్సిడీ విత్తనాలకు ప్రభుత్వం జిల్లాకు రూ.83లక్షలు మాత్రమే కేటాయించింది. చేవెళ్ల డివిజన్‌లోని చేవెళ్ల, పూడూరు, షాబాద్ మండలాలకు రూ.18 లక్షలు ఇచ్చారు. అంటే మండలానికి రూ.ఆరు లక్షలు. చేవెళ్ల హెచ్‌ఓ పరిధిలో ఇచ్చిన రూ.18లక్షల విలువైన సబ్సిడీ విత్తనాలను వచ్చిన రెండు రోజుల్లోనే రైతులందరూ డీడీలు కట్టి తీసుకున్నారు. ఇంకా చాలా మంది రైతులకు ఆ విత్తనాలు అందలేవు. డివిజన్‌లో బీట్‌రూట్, క్యాలిఫ్లవర్, టమాటా, క్యాబేజీ, మిర్చి తదితర పంటలు ఎక్కువగా సాగు చేస్తున్నారు. సబ్సిడీ విత్తనాలు వచ్చే నాటికి దాదాపు సగం మంది రైతులు విత్తనాలు ప్రైవేటుగానే కొనుగోలు చేశారు. ప్రభుత్వ ప్రోత్సాహలేమి కారణంగా కూరగాయల రైతులు అప్పులఊబిలో కూరుకుపోతున్నారు. ప్రస్తుతం కూరగాయల సాగంటేనే భయపడే స్థితిలో ఉన్నారు. ఒక ఎకరంలో కూరగాయల సాగుకు దాదాపు రూ.35 వేల నుంచి రూ. 45 వేలు ఖర్చు చేస్తున్నారు. వాతావరణ పరిస్థితులు, మార్కెట్‌లో దళారులు, ధరలలేమీ కారణంగా ఒక్కోసారి అవి కూడా చేతికి రావడం లేదు.
జిల్లాలో సాగు, అందిన సబ్సిడీలు..
2009లో జిల్లాకు రూ.రెండు కోట్లు సబ్సిడీ రూపంలో ఇచ్చారు. ఆ తర్వాత యేటా తగ్గిస్తూ ఇస్తున్నారు. 2012-13లో కూరగాయల సాగు 24,419 హెక్టార్లు ఉంటే ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీ రూ. కోటి. ఇది కేవలం 3,342 హెక్టార్లకు సరిపోయింది. 2013-14లో సాగు 28,508 ఉంటే ప్రభుత్వ సబ్సిడీ 1.35 కోట్లు. ఇది 4,530 హెక్టార్లకు వస్తుంది. 2014-15లో 28,264 సాగుకు రూ.1.80కోట్లు ఇచ్చారు. ఇది 5,300 హెక్టార్లకు మించి సరిపోదు. ఈఏడాది జిల్లాకు రూ.83లక్షల కేటాయించారు. ఇప్పటివరకు 4,600ల హెక్టార్ల సాగు మాత్రమే జరిగింది.