మొర ‘ఆలు’కించదే!
- భారీగా పడిపోయిన సరఫరా
- అమాంతం పెరిగిన బంగాళ దుంపల ధరలు
సాక్షి, సిటీబ్యూరో: నగర మార్కెట్లో ఆలుగడ్డ ధరదడ పుట్టిస్తోంది. గతంలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో కిలో రూ.40కి చేరింది. ప్రస్తుతం మిగిలిన కూరగాయల ధరలు కిందికి దిగివస్తుంటే... ఆలు ధరలు ఆకాశం వైపు దూసుకుపోతున్నాయి. దీంతో వినియోగదారులు హడలిపోతున్నారు. సగటు జీవికి అందనంత ఎత్తులో బంగాళాదుంప ధర ఉంటోంది.
సరఫరా తగ్గడ మే ధరలు పెరుగుదలకు కారణమని చెబుతున్నారు. గత ఎనిమిది నెలలుగా నగరానికి ఆలు అరకొరగానే సరఫరా అవుతున్నాయి. ఫలితంగా ధరలు అస్థిరంగా ఉంటున్నాయి. సంపన్నులు తప్ప సామాన్యులు కొనలేని పరిస్థితి ఏర్పడింది. స్థానికంగా ఆలు సాగు లేకపోవడంతో ఇతర రాష్ట్రాల దిగుమతుల పైనే నగర మార్కెట్ ఆధారపడుతోంది.
ప్రధానంగా మహారాష్ట్రలోని నాగపూర్, షోలాపూర్, పూనే, ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా, కర్ణాటకలోని అకోలా నుంచి నగరానికి నిత్యం 500-600 టన్నుల ఆలు దిగుమతి అవుతోంది. మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రతికూల పరిస్థితుల వల్ల దిగుబడి అనూహ్యంగా తగ్గిపోయింది. ఫలితంగా మన రాష్ట్రానికి దిగుమతులు తగ్గిపోయాయి. ఫలితంగా 7-8 నెలలుగా ఆలు ధరలకు రెక్కలు వచ్చాయి. ప్రస్తుతం ఆగ్రా, నాగపూర్‌ల నుంచి రోజుకు 200 టన్నుల ఆలు దిగుమతి అవుతున్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.
అరకొరగా వచ్చిన సరుకుకు డిమాండ్ బాగా ఉండడంతో వ్యాపారులు ధరలు పెంచేస్తుస్తున్నారు. రైతుబజార్‌లో కేజీ రూ.29కు అమ్ముతుండగా రిటైల్ మార్కెట్లో మాత్రం కేజీ రూ.40ల చొప్పున వసూలు చేస్తున్నారు. ఆలు దిగుమతులపై మార్కెటింగ్ శాఖ దృష్టి పెట్టకపోవడంతో ధరలు అస్థిరంగా ఉంటూ వినియోగదారులను కలవరానికి గురిచేస్తున్నాయి. స్థానికంగా జహీరాబాద్, వికారాబాద్, తూప్రాన్, దౌల్తాబాద్ వంటి ప్రాంతాల్లో సాగవుతున్న ఆలు దిగుబడి వస్తే ధరలు కాస్త తగ్గే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.