ఈ ‘ధర’ణిలో బతికేదెలా!
- కిలో రూ.30 నుంచి రూ.40కి పెరిగిన సన్నబియ్యం
- మండుతున్న కూరగాయల ధరలు
- ఒక్కసారిగా రూ.100 పెరిగిన సిమెంట్
- మార్కెట్ అంటే జంకుతున్న సామాన్యులు
- ధరల నియంత్రణలో అధికారులు విఫలం
ఒంగోలు టూటౌన్: ధరలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. సామాన్యులు కొనలేని స్థితికి చేరుకుంటున్నాయి. మార్కెట్‌కు వెళ్లాలంటే పేద, మధ్యతరగతి ప్రజలు జంకుతున్నారు. నెల రోజులుగాఅన్ని వస్తువుల ధరలూ ఆకాశాన్నంటుతున్నాయి. ఇటీవల పెరిగిన కొన్ని వస్తువుల ధరలు చూస్తే గుండె గుభేల్‌మంటోంది. బియ్యం ధరలు అమాంతంగా పెరిగాయి. ప్రజలు ఎక్కువగా వాడే సన్నబియ్యం, లావు బియ్యం ధరలు వినియోగదారులకు మార్కెట్‌లో చుక్కలు చూపిస్తున్నాయి.
బియ్యం ధరలు పెరిగిందిలా..
ఈ ఏడాది ఫిబ్రవరిలో సన్నబియ్యం(బీపీటీలు) కిలో రూ.30 నుంచి రూ.35 ఉంటే ఇప్పుడు కిలో రూ.40 పలుకుతోంది. అదే విధంగా లావు బియ్యం 25 కిలోల బ్యాగ్ రూ.1050 పెరిగింది. కిలో రూ.40 పైనే పెరిగింది. బియ్యం వ్యాపారులు అక్రమ నిల్వలు సృష్టించి ధరలు పెంచి సొమ్ము చేసుకుంటున్నారు. ఒక్కొక్క రైస్ షాపుల వద్ద 250 క్వింటాళ్ల కంటే అదనంగా బియ్యం నిల్వలు ఉండకూడదు. వ్యాపారులు నిబంధనలు అతిక్రమించి అధికంగా కొని అక్రమ నిల్వలకు పాల్పడుతుండటంతో బియ్యం ధరలు పెరుగుతున్నాయి. సివిల్ సప్లై ఉదాసీనంగా వ్యవహరించడంతో వ్యాపారులు ఆడిందే ఆట.. పాడిందే పాటగా తయారయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
మండుతున్న కూరగాయల ధరలు :
కూరగాయల సాగు విస్తీర్ణం రానురానూ తగ్గిపోతుండటంతో కూరగాయల ధరలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. అరకొరగా సాగు చేసిన కూరగాయల పంటలకు వ్యవసాయాధికారుల సూచనలు, సలహాలు కరువై.. చీడపీడల బెడదతో పంటలను అర్ధాంతరంగా వదిలేయాల్సిన పరిస్థితి వస్తోంది. ఈ ఏడాది వాతావరణం అనుకూలించక వంగతోటలు చీడపీడలకు గురై రైతుకు నష్టాలను మిగిల్చాయి. మార్కెట్‌లో కూరగాయల ధరలు రెండు నెలలుగా మండుతున్నాయి.
గతంలో కేజీ రూ.10 నుంచి రూ.12 వరకు అమ్మిన వంకాయలు ఇప్పుడు డిమాండ్‌ను బట్టి రూ.24 వరకు పలుకుతోంది. ఒక దశలో రూ.40 పెరిగింది. అదే విధంగా క్యారెట్ రూ.24 ఉండగా.. కిలో రూ.60 చేరింది. రూ.40 అమ్మిన చిక్కుళ్లు రూ.80 చేరి వామ్మో అనిపిస్తోంది. కాలీఫ్లవర్ పువ్వు ఒకటి రూ.10 నుంచి రూ.15 ఉండగా ఇప్పుడు రూ.25 వరకు అమ్ముతున్నారు. బీర కిలో రూ.20 నుంచి రూ.30, బీట్‌రూట్ రూ.22 నుంచి రూ.25 నుంచి రూ.30 వరకు అమ్ముతున్నారు.
మిర్చి రూ.14 నుంచి రూ.20 చేరింది. దోసకాయలు రూ.5 నుంచి రూ.10 చేరింది. పెద్దఉల్లి రూ.12 నుంచి రూ.18 పెరిగింది. దొండ కాయలు కిలో రూ.14 నుంచి రూ.20 పెరిగి వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. కూరగాయల ధరలతోపాటు ఆకుకూరలైన గోంగూర, పెరుగు ఆకు, తోటకూర వంటి వాటికి కూడా ధరలు పెరిగాయి. గతనెలలో కేజీ ఉల్లిపాయల ధర రూ.12 నుంచి రూ15 వరకు ఉండగా ప్రస్తుతం రూ 30 లు పలుకుతోంది.
పాలధరలు...
పాలధరలు అమాంతంగా పెరిగాయి. లీటర్ రూ.42 నుంచి రూ.46 పెరిగింది. గతంలో లీటరు పాలు కొనే వారు ఇప్పుడు అరలీటరు కొనుక్కొని సర్దుకుంటున్నారు. పేద, మధ్య తరగతి వినియోగదారులు చాలమంది పాలనే కొనుక్కోవడం మానేయాల్సి వచ్చింది. పెరుగు, వెన్న ధరలు పెంచేశారు.
కొండెక్కిన సిమెంట్ ధరలు :
సిమెంట్ మంట పుట్టిస్తోంది. బస్తాపై రెండు సార్లు ధర పెరిగింది. గతంలో రూ.200 నుంచి రూ.210 ఉన్న సిమెంట్ ధరలు ఇప్పుడు రూ.300 నుంచి రూ.310 పెరిగింది. ధరలు పెరుగుతున్న సంగతి ముందే తెలుసుకొని పాత ధరలకు అధిక మొత్తంలో కొని నిల్వలు చేసుకున్నారు. ఇప్పుడు కొత్త ధరలకు అమ్మి వినియోగదారుల నెత్తిన శఠగోపం పెడుతున్నారు. పెరిగిన ధరల ఫలితంగా జిల్లాలో నెలకు 50 వేల టన్నుల అమ్మకాలు జరిగిన వ్యాపారం ఇప్పుడు 40 వేల టన్నులకు పడిపోయింది. అయినా ఇళ్లు కట్టుకునే పేద, మధ్య తరగతి ప్రజలకు భారంగా పరిణమించింది.
మార్కెట్‌లో ధరలు ఒకదాని ప్రభావం ఇంకొక వస్తువు పడి భారంగా పరిణమించాయి. టీ రూ.5 నుంచి రూ.7 పెంచారు. కాఫీ రూ.8 అమ్ముతున్నారు. అల్పాహారాల ధరలూ పెరిగిపోయాయి. ధరల అదుపునకు ప్రభుత్వం ఏ మేరకు చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.