చెన్నై: మైనారిటీల భద్రత, అఫ్జల్ గురు వ్యవహారంలో కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం వ్యాఖ్యలు అర్థరహితమని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖమంత్రి వెంకయ్య నాయుడు విమర్శించారు. ఆదివారం చెన్నైలో వెంకయ్య నాయుడు విలేకరులతో మాట్లాడారు. అఫ్జల్ గురు క్షమాభిక్ష ఫైల్‌ను హోం మంత్రిగా ఉన్న సమయంలో పట్టించుకోని చిదంబరం, ఇప్పుడు కొత్త పల్లవి అందుకోవడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు.
ఇంతకీ అఫ్జల్ తీవ్రవాదా..? కాదా..? అన్న విషయం కాంగ్రెస్‌తో పాటుగా చిదంబరం స్పష్టం చేయాలని వెంకయ్య నాయుడు ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోదీ బలం పెరుగుతున్నదని, దీంతో కాంగ్రెస్‌లో గుబులు పట్టుకుని, ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తూ ముందుకు సాగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యూనివర్సిటీలను రాజకీయ వ్యవహారంలోకి తీసుకొచ్చి భ్రష్టు పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
హైదరాబాద్‌లో పదిమంది విద్యార్థులు గతంలో మరణిస్తే, పట్టించుకోని వాళ్లు, ఇప్పుడు ఓ విద్యార్థి విషయాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయ లబ్ధి కోసం ఆరాటపడుతున్నారని వెంకయ్య నాయుడు విమర్శించారు. కొన్ని పత్రికలు సైతం బాధ్యతా రహితంగా వ్యవహరిస్తున్నాయని, ఏదేని కీలక విషయం ఉంటే దానిని పక్కన పెట్టి, అనవసరపు రాద్ధాంతాల్ని హెడ్‌లైన్లలో చూపిస్తున్నారని మండి పడ్డారు. జేఎన్‌యూలో జరిగిన వ్యవహారాన్ని హైలెట్ చేసిన మీడియా, అక్కడి చర్యలకు వ్యతిరేకంగా జరిగిన భారీ నిరసనను పట్టించుకోక పోవడం బట్టి చూస్తే.. ఏ మేరకు బాధ్యతగా వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు. విపక్షాల నిరసనలపై స్పందించాల్సిన అవసరం ప్రధాని మోదీకి లేదన్నారు.