
ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు (ఫైల్‌ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ : సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిపై విపక్షాల అభిశంసన తీర్మానాన్ని తిరస్కరిస్తూ తాను తీసుకున్న నిర్ణయాన్ని రాజ్యసభ ఛైర్మన్ ఎం.వెంకయ్య నాయుడు సమర్థించుకున్నారు. నెలరోజుల కసరత్తు అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నానని, ఇందులో తొందరపాటు లేదని ఆయన వివరణ ఇచ్చారు. రాజ్యాంగ నిబంధనలు, న్యాయమూర్తుల విచారణ చట్టం 1968కి లోబడి తాను తీసుకున్న నిర్ణయాన్ని కొందరు సుప్రీం కోర్టు న్యాయమూర్తులు సైతం ప్రశంసించారని తనను కలిసిన న్యాయవాదులతో చెప్పుకొచ్చారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా అభిశంసన తీర్మానానికి విపక్ష ఎంపీలు ఇచ్చిన నోటీసును సోమవారం వెంకయ్య నాయుడు తిరస్కరించిన విషయం తెలిసిందే.
ఈ నోటీసుపై పలు పార్టీలకు చెందిన 64 మంది ఎంపీలు సంతకాలు చేశారు. నోటీసులో ఎంపీలు ప్రస్తావించిన ఆరోపణలు పరిశీలనార్హమైనవి కానందున దీనిపై చర్యలు తీసుకోలేమని వెంకయ్య పేర్కొన్నారు. కాగా అభిశంసన తీర్మానానికి తామిచ్చిన నోటీసును రాజ్యసభ ఛైర్మన్ తోసిపుచ్చడంపై విపక్షాలు భగ్గుమన్నాయి. వెంకయ్య నిర్ణయం చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం, తొందరపాటుతో కూడుకున్నదని కాంగ్రెస్ నేత, మాజీ న్యాయ శాఖ మంత్రి కపిల్ సిబల్ అభివర్ణించారు. ఈ నిర్ణయాన్ని ఎంపీలు సుప్రీం కోర్టులో సవాల్ చేస్తారని చెప్పారు.